ఉమ్మడి పౌరస్మ్రతి అమలు చేయనున్న తొలి రాష్ట్రం అదేనా?
ఒక దేశం.. ఒక చట్టం అన్నట్లుగా చెప్పే కామన్ సివిల్ కోడ్ ఎట్టకేలకు చేతల్లోకి వస్తున్న పరిస్థితి.
By: Tupaki Desk | 12 Nov 2023 5:20 AM GMTఒక దేశం.. ఒక చట్టం అన్నట్లుగా చెప్పే కామన్ సివిల్ కోడ్ ఎట్టకేలకు చేతల్లోకి వస్తున్న పరిస్థితి. దేశ ప్రజలంతా ఒక్కటే అయినప్పటికీ... వారు అనుసరించే మతం ఆధారంగా సివిల్ కోడ్ ఉండటం తెలిసిందే. ఈ అంశంపై పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఒకే దేశం..ఒకే శిక్షాస్మ్రతి అన్న వాదనకు బలం పెరిగింది. మతాలకు.. కులాలకు అతీతంగా అందరికి ఒకేలాంటి సివిల్ కోడ్ ఉండాలన్న డిమాండ్ పెరిగింది. ఇందుకు తగ్గట్లే బీజేపీ మొదట్నించి తన ఎన్నికల హామీల్లో కామన్ సివిల్ కోడ్ మీద స్పష్టమైన హామీ ఇవ్వటం తెలిసిందే.
ఇటీవల ఈ అంశం పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాలు దీన్ని అమలు చేయాల్సి ఉంది. అయితే.. దీనిపై దేశంలోని ఏ రాష్ట్రం ముందుకు అడుగు వేయలేదు. ఇలాంటి వేళ.. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి కామన్ సివిల్ కోడ్ ను ఉత్తరాఖండ్ లో అమలు చేసేందుకు వీలుగా ఏర్పాటు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
గత ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామన్ సివిల్ కోడ్ ను అమల్లోకి తీసుకొస్తామని బీజేపీ మాట ఇవ్వటం తెలిసిందే. ఉమ్మడి పౌరస్మ్రతి బిల్లుకు ఆమోదం తెలిపేందుకు దీపావళి తర్వాత అసెంబ్లీప్రత్యేక సమావేశాల్నినిర్వహించనున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఉత్తరాఖండ్ లో అమలు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనూ అమలు చేస్తారని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళకు ఈ అంశం ఒక బలమైన ప్రచార ఆయుదంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.