పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ కి ఎన్నిక ?
కాంగ్రెస్ సహా విపక్షాలు అపుడు తక్కువ బలంతో ఉన్నాయి కాబట్టి ఏమీ అనలేని పరిస్థితి.
By: Tupaki Desk | 18 Jun 2024 3:34 AM GMTలోక్ సభ స్పీకర్ కి తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయా బీజేపీ బలాన్ని బలహీనతలను బయటపెట్టాలని ఇండియా కూటమి నిశ్చయించుకుందా అంటే జవాబు అవును అనే వస్తోంది. 2014, 2019లలో సొంత మెజారిటీ సాధించింది కాబట్టి బీజేపీ ఏం చేసినా చెల్లింది. కాంగ్రెస్ సహా విపక్షాలు అపుడు తక్కువ బలంతో ఉన్నాయి కాబట్టి ఏమీ అనలేని పరిస్థితి.
ఈసారి మాత్రం అలా కాదు. బీజేపీ సొంత బలం 240 సీట్ల దగ్గర ఆగిపోతే ఇండియా కూటమి బలం 233 దగ్గర ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవడానికి ఇండియా కూటమిక్ 40 మంది అవసరం అయితే ఎన్డీయేకు 32 మంది అవసరం పడతారు. బీజేపీ తెలివిగా ఎన్నికల ముందు ఎన్డీయే మిత్రులను చేర్చుకుంది కాబట్టి ప్రధాని పీఠం దక్కింది.
అయితే ఆ ముచ్చట ఎన్నాళ్ళు అన్నది ఇండియా కూటమి నుంచి వినిపిస్తున్న ప్రశ్న. దానికి లిట్మస్ టెస్ట్ గా స్పీకర్ ఎన్నిక నుంచే ఎన్డీయే కూటమికి షాక్ ఇవ్వాలని ఇండియా కూటమి భావిస్తోంది అని అంటున్నారు. ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్న టీడీపీ జేడీయూలకు స్పీకర్ పదవి మీద మోజు ఉంది.
ఆ పదవి తీసుకుంటేనే వారి ఎంపీలు క్షేమమని లేకపోతే ఆరు నెలలు తిరగకుండానే బీజేపీ తనదైన రాజకీయ ఆట మొదలెడుతుందని ఇప్పటికే ఇండియా కూటమి పక్షాలు హెచ్చరిస్తున్నాయి. నిజానికి చూస్తే ఆ భయం ఇండియా కూటమికీ ఉంది. బీజేపీకి మెజారిటీ లేకపోతే ఏమి చేస్తుంది అన్నది కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఉదంతాలు గతంలో నిరూపించాయి.
అందుకే బీజేపీ కూడా లోక్ సభ స్పీకర్ తమ వాడు అయి ఉండాలని పట్టుదలగా ఉంది. అయితే టీడీపీ జేడీయూ ఈ పదవిని కోరినా బీజేపీ ససేమిరా అంటోంది. సరిగ్గా ఈ పాయింట్ వద్దకే ఇండియా కూటమి ఆగింది. లోక్ సభ స్పీకర్ గా టీడీపీ జేడీయూ తన అభ్యర్థులను ప్రకటిస్తే మద్దతు ఇచ్చేందుకు మేము రెడీ అని అంటోంది.
దాంతో లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఈసారి ఏకాభిప్రాయంతో జరిగేనా అన్న చర్చ వస్తోంది. ఒక వేళ ఎన్డీయే మిత్రులు బీజేపీకి సపోర్టుగా ఉంటే మాత్రం ఇండియా కూటమి నుంచి తమ అభ్యర్ధిని స్పీకర్ గా పోటీకి పెడతామని కూడా అంటోంది. అంటే ఎన్డీయే కూటమిలో లుకలుకలు నిజంగా ఉంటే అవి బయటపడతాయని ఎన్డీయే కోటకు బీటలు వారేలా చేయాలన్నదే ఇండియా కూటమి ఆలోచన అని అంటున్నారు.
మరో వైపు చూస్తే లోక్ సభకు 1952 నుంచి చూస్తే ఎపుడూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తప్ప ఎన్నిక అన్న ప్రసక్తి లేదు. ఆలాగే ఇప్పటిదాకా కధ సాగుతూ వస్తోంది. 26 పార్టీలతో అతి పెద్ద సంకీర్ణ ప్రభుత్వాన్ని వాజ్ పేయ్ నడిపినా కూడా లోక్ సభ స్పీకర్ విషయంలో నాడు విపక్షం పోటీ పడలేదు.
కానీ ఫస్ట్ టైం పార్లమెంట్ హిస్టరీలో స్పీకర్ పదవికి పోటీ అంటోంది ఇండియా కూటమి. అలా జరగకుండా ఉండాలీ అంటే పెరిగిన విపక్ష బలాన్ని గుర్తించి డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని కోరుతోంది. అయితే ఇండియా కూటమి డిమాండ్లను ఎండీయే పట్టించుకునే చాన్స్ లేదు అని అంటున్నారు. ఇక మిత్రులు స్పీకర్ పదవి కోరినా బీజేపీ మనిషినే స్పీకర్ గా ఉంచుకోవాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది. ఎవరికీ మెజారిటీలు లేని ఈ సందర్భంలో కీలక పాత్ర స్పీకర్ దే అవుతుంది. అందువల్ల స్పీకర్ తమ వాడే ఉండాలని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు.
ఇటు మిత్రులను ఒప్పించుకుని అటు విపక్షాలని గెలిచి స్పీకర్ పదవిని బీజేపీ ఎలా సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి.26న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. మరి అది ఏకగ్రీవం అయ్యే సూచనలు అయితే ఇప్పటికి లేవు అని అంటున్నారు.