వైఎస్ షర్మిల మీద ఫస్ట్ టైం కేసీయార్ ....!
తప్పిస్తే ప్రత్యర్ధులను తన సభల్లో పేర్లు పెట్టి విమర్శించేది పెద్దగా ఉండదు.
By: Tupaki Desk | 13 Nov 2023 3:28 PM GMTబీయారెస్ అధ్యక్షుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ప్రత్యర్ధి నాయకుల పేర్లను తన నోటి వెంట పలకరు. ఆయన పేరు పెట్టకుండా పరోక్షంగానే విమర్శిస్తారు. ఈ రోజుకు ఆయన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పేరు పెట్టి విమర్శించలేదు అన్నది గుర్తు చేస్తారు. అసలు పీసీసీ చీఫ్ అన్న మాటను కూడా ఎన్నికల ప్రచారం వేళ మాత్రమే ఉపయోగిస్తున్నారు. అది కూడా జనాలకు అర్ధం కావాలని ఆయన ఆ మాట అంటున్నారు. తప్పిస్తే ప్రత్యర్ధులను తన సభల్లో పేర్లు పెట్టి విమర్శించేది పెద్దగా ఉండదు.
ఆయన మాట్లాడితే నరేంద్ర మోడీ లేదా అమిత్ షా, లేదా కిషన్ రెడ్డి గురించి ఎక్కువగా విమర్శలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో చూస్తే రాహుల్ గాంధీ సోనియా గాంధీల మీదనే ఆయన విమర్శలు ఉంటాయి. తప్పితే లోకల్ లీడర్స్ మీద ఆయన నేరుగా పేర్లు పెట్టి విరుచుకుపడరు.
అయితే చిత్రంగా ఆయన వైఎస్ షర్మిల పేరు చెప్పి మరీ విమర్శించారు. దానికి కారణాలు వ్యూహాలు ఏమున్నాయో తెలియదు కానీ నర్సంపేట సభలో ఆయన బీయారెస్ ఎన్నికల ప్రచారం చేస్తూ అక్కడ అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ కేసీయార్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సమైక్యవాదుల విషయంలో గట్టిగా నిరసనలు తెలియచేశారు అన్న దాంతో వైఎస్ షర్మిల పగ పట్టారని, ఆయన్ని ఎలాగైనా ఓడించారని ఆమె డబ్బు కట్టలు పంపిస్తున్నారని కేసీయార్ హాట్ కామెంట్స్ చేశారు.
డబ్బు కట్టలతో సుదర్శన్ రెడ్డిని ఓడించాలని చూస్తున్నారని పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన వారు తెలంగాణాలో రాజకీయాలు చేస్తున్నారని కేసీయార్ షర్మిల మీద విరుచుకుపడ్డారు. వారి డబ్బుతో మన వారిని ఓడించుకుందామా లేక మన వారిని మనమే గెలిపించుకుందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కొంతమంది సమైక్యవాదులు వారి చెందాలు పెత్తనం చేయాలని చూస్తున్నారని వారంతా ఎన్నికల్లో ఒకటిగా వస్తున్నారని కేసెయార్ పేర్కొన్నారు.
వైఎస్ షర్మిల విషయం కేసీయార్ ఎందుకు ప్రస్తావించారు అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్ కి మద్దతుగా నిలుస్తారు అన్న ప్రచారం ఒక వైపు ఉంది. మరో వైపు ఈ ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. ఒక్క ఓటు అటు నుంచి ఇటు అయినా గెలుపును శాసిస్తుంది. దాంతో అన్ని జాగ్రత్తలను తీసుకుంటూనే ఆయన ఈ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. ఆయన షర్మిల పేరు మాత్రమే పేర్కొంటూ సమైక్య వాదులు వారి చెందాలు అని అంటున్నారు. మరి మిగిలిన సమైక్యవాదులు ఎవరు, వారి చెంచాలు ఎవరు తెలంగాణాలో పనిచేస్తున్నారు అన్నది మాత్రం చెప్పలేదు.
దాన్ని ఎవరి ఊహలకు వారికే అన్నట్లుగా వదిలేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి బాహాటంగా మద్దతు ప్రకటించడం వల్ల ఆమె పేరు ఎత్తి కేసీయార్ విమర్శించారు. మరి ఇండైరెక్ట్ గా టీడీపీ కూడా కాంగ్రెస్ కే మద్దతు ప్రకటిస్తోంది అని ప్రచారం ఉంది. కేసీయార్ రానున్న ఎన్నికల సభలలో చంద్రబాబు గురించి కూడా మాట్లాడుతారా, మాట్లాడితే ఏ రేంజిలో ఉంటుంది అన్న చర్చ అపుడే బయల్దేరింది. అయితే బీయారెస్ తుది విడత ప్రచారాంలో మాత్రం చంద్రబాబుని నేరుగా మాటలతో అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.