అంతరిక్షంలోకి చేపలు పంపుతున్న చైనా... కారణం ఇదే!
స్పెస్ డాట్ కమ్ లో ప్రచురించబడిన సమాచారం ప్రకారం... చైనా ఒక పరిశోధన కోసం చేపలను అంతరిక్షంలోకి పంపుతోంది
By: Tupaki Desk | 1 Aug 2023 11:30 PM GMTప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అంతరిక్ష పరిశోధనలపై పూర్తి శ్రద్ధపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచంలో ఒక దేశం బాగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి... అంతరిక్ష పరిశోధనల్లో వారి పాత్ర, సక్సెస్ పర్సంటేజ్ కూడా కీలకంగా మారుతోందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది.
గతకొంతకాలంగా అంతరిక్షంలో పెద్ద శక్తిగా మారాలని చైనా కోరుకుంటోన్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొంది. ఇందులో భాగంగా... అంతరిక్షంలో వివిధ రకాల పరిశోధనలు చేస్తోంది. ఫలితంగా సోవియెట్ యూనియన్, నాసా తర్వాత స్థానాల్లో చైనా చేరనుంది!
అవును... ఇప్పుడు ఈ అంతరిక్ష కేంద్రానికి చైనా బ్రతికున్న చేపను పంపుతోంది. స్పెస్ డాట్ కమ్ లో ప్రచురించబడిన సమాచారం ప్రకారం... చైనా ఒక పరిశోధన కోసం చేపలను అంతరిక్షంలోకి పంపుతోంది. దీంతో... అంతరిక్ష కేంద్రం వంటి క్లోజ్డ్ ఎకోసిస్టమ్ లో చేపల ఎముకలు ఎలా ప్రభావితమవుతాయో చూడాలని చైనా భావిస్తోంది.
ఫలితంగా... అంతరిక్ష కేంద్రంలో నివసించే మానవులపై ఆ వాతావరణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చునని చైనా అభిప్రాయపడిందని తెలుస్తోంది. అయితే, ఇలాంటి ప్రయోగం చేస్తున్న దేశాల్లో చైనా మొదటిది కాదు. చైనాకంటే ముందు పలు దేశాలు అంతరిక్షంలోకి చేపలు వంటి జీవరాశులను పంపాయి.
ఇందులో భాగంగా... చైనా కంటే ముందే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా చేపలను అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్ కు చెందిన ఓ చేపను నాసా అంతరిక్షంలోకి పంపింది. సముద్ర జీవులపై మైక్రోగ్రావిటీ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం కనుక్కోవడానికి నాసా ఈ ప్రయోగం చేసింది.
అంతకంటే ముందు సోవియట్ యూనియన్ 1976 సంవత్సరంలో కూడా ఒక జీబ్రాఫిష్ ను అంతరిక్షంలోకి పంపింది. ఈ పరిశోధనలో, సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో నివసించిన తర్వాత ఈ చేప ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనుగొన్నారు.
ఇంతకు ముందు సోవియట్ యూనియన్ కుక్కను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే మిషన్ ప్రారంభించిన కొద్దిసేపటికే, ఆ కుక్క శరీరం అకస్మాత్తుగా వేగంగా వేడెక్కడం ప్రారంభించి మరణించింది. ఈ క్రమంలోనే తాజాగా ఒక చేపను చైనా అంతరిక్షంలోకి పంపనుంది!