Begin typing your search above and press return to search.

5 అంతర్జాతీయ పరిణామాలు.. అవేమంటే?

ప్రపంచం కుగ్రామంగా మారింది. ఎక్కడ ఏం జరిగినా.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అంతో ఇంతో ప్రభావం పడే పరిస్థితి.

By:  Tupaki Desk   |   1 Oct 2024 4:30 PM GMT
5 అంతర్జాతీయ పరిణామాలు.. అవేమంటే?
X

ప్రపంచం కుగ్రామంగా మారింది. ఎక్కడ ఏం జరిగినా.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అంతో ఇంతో ప్రభావం పడే పరిస్థితి. పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమాఅని ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు..మారిన కాలానికి తగ్గట్లు.. ప్రపంచ దేశాలన్ని కూడా ఒకరికతో ఒకరు సంబంధాలు పెట్టుకుంటున్న వైనం తెలిసిందే. దీంతో.. ఒక దేశానికి సంబంధించి ఏం జరిగినా.. దాని కారణంగా మిగిలిన దేశాలు ప్రభావితం కావటం.. వారి కారణంగా మిగిలిన వారు ఇబ్బందులకు గురి కావటం జరుగుతోంది.

ఈ రోజు(మంగళవారం) అనూహ్యంగా అంతర్జాతీయంగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసేవే. అందుకే.. ఈ ఐదు పరిణామాల్ని తెలుసుకోవటం.. అప్డేట్ చేసుకోవటం చాలా అవసరం. ఇంతకూ ఆ ఐదు అంతర్జాతీయ పరిణామాలేమంటే?

1. కిమ్ నోట కీలక ప్రకటన

ఉత్తర కొరియా రూటు మార్చింది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో క్లోజ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన తీరులో మార్పు వచ్చింది. ఈ విషయాన్ని న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన నార్త్ కొరియా ప్రతినిధి స్పష్టం చేశారు. అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా తాము ఇకపై అమెరికా ప్రభుత్వంతోనే డీల్ చేస్తామని.. వ్యక్తిగతంగా తాము ఎలాంటి దౌత్యాలు నెరపమని స్పష్టం చేయటం గమనార్హం.

ఉత్తర కొరియా నుంచి అమెరికాకు పారిపోయిన ఒక ప్రముఖ దౌత్యవేత్త మాట్లాడుతూ ట్రంప్ అధికారంలోకి వస్తే చర్చలు జరపాలని కిమ్ సర్కారు భావిస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. హారిస్ ను ఓడించి ట్రంప్ ను అధికారంలోకి వచ్చేలా ఉత్తర కొరియా అధికారులు వ్యూహరచన చేస్తున్నట్లుగా అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కిమ్ ప్రభుత్వం తాజా క్లారిటీ ఇవ్వటం గమనార్హం. తమపై ఉన్నఆంక్షల తొలగింపు.. ఉగ్రవాద దేశంగా ఉన్న ముద్రను తుడిపేసుకోవటమే తమ లక్ష్యంగా ప్రకటించారు. ఈ మధ్యన ట్రంప్ మాట్లాడుతూ తనను కిమ్ ఇష్టపడతారని చెప్పటంతో పాటు.. బైడెన్ - హారిస్ సర్కారును ఉత్తరకొరియా ఇష్టపడదని పేర్కొన్న నేపథ్యంలో తాజా ప్రకటన రావటం గమనార్హం.

2. లెబనాన్ సరిహద్దుల్లో భారత సైనికులు

చూస్తుండగానే ఇజ్రాయెల్ - హెజ్ బొల్లాల మధ్య యుద్ధం అంతకంతకూ తీవ్రతరం కావటమే కాదు.. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ లో అడుగుపెట్టటం తెలిసిందే. ఈ సమయంలో లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారత సైనికుల్ని మొహరించినట్లుగా ప్రకటన విడుదలైంది. అయితే.. వీరంతా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో భాగంగా గస్తీ కాసే వారు కావటం గమనార్హం. ఇజ్రాయెల్ - లెబనాన్ సరిహద్దుల్లోని 120 కి.మీ. బ్లూలైన్ వెంట 600 మంది భారతీయ సైనికుల్ని మొహరించారు.

3. ఇరాన్ కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

ఇటీవల కాలంలో పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. తాజాగా లెబనాన్ లోకి ఇజ్రాయెల్ తన సైనికుల్ని పంపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ దాని మిత్రదేశం అమెరికా సీన్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ మీద దాడులకు కానీ దిగితే బాగోదన్న సందేశాన్ని ఇరాన్ కు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ మీద నేరుగా దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు.. ఇజ్రాయెల్ కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని వ్యాఖ్యానించటం గమనార్హంప

గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై జరిగిన తరహా దాడులకు తావు లేకుండా ఉండేందుకు సరిహద్దుల వెంట హెజ్ బొల్లాకు చెందిన నిర్మాణాల్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని.. ఇరాన్.. దాని మద్దతు ఉన్న గ్రూపుల నుంచి అమెరికా సిబ్బంది.. మిత్రులను రక్షించుకునేందుకు యూఎస్ సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వ్యాఖ్యానించారు.

4. అమెరికా సరిహద్దుల్లో రష్యా జెట్

అనూహ్య రీతిలో రష్యా చర్య ఇప్పుడు కొత్త టెన్షన్ కు కారణమైంది. రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లోకి దుందుడుకుగా వ్యవహరించింది. మాస్కో విమానాన్ని వెనక్కి పంపేందుకు అమెరికా కూడా తన ఎఫ్ 16 ఫైటర్ జెట్ ను రంగంలోకి దించాల్సి వచ్చింది. రష్యాకు చెందిన ఫైటర్ జెట్ అమెరికా విమానానికి కొన్ని అడుగుల దూరానికి వచ్చినట్లుగా విడుదల చేసిన వీడియో స్పష్టం చేస్తోంది. రష్యా ఫైటర్ జెట్ తీరుపై రష్యా దౌత్య కార్యాలయానికి సమాచారాన్ని పంపినట్లుగా అమెరికా ప్రకటించింది.

5. ఇరాన్ పాలకులకు ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్

గత ఏడాది తమ సరిహద్దుల్లోకి ప్రవేశించి.. తమ పౌరుల్ని ఊచకోత కోసిన వైనంపై ఇజ్రాయెల్ రగిలిపోవటం.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చర్యలు చేపట్టటం తెలిసిందే. గడిచిన రెండు మూడు రోజులుగా హెజ్ బుల్లా అగ్రనాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు చేపట్టిన భీకర దాడుల గురించి తెలిసిందే. తాజాగా లెబనాన్ లోకి తమ సైనికుల్ని పంపుతున్న ఇజ్రాయెల్.. దాని మిత్రదేశమైన ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఇరాన్ నిరంకుశ పాలనను అంతం చేసి ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక వీడియో విడుదల చేశారు. ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా మాట్లాడిన ఆయన.. ఆ దేశంలోని ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.

ప్రతి రోజూ మీ పాలకులు మిమ్మల్ని అణిచివేస్తూ.. గాజా.. లెబనాన్ ను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తూనే ఉన్నారు. వారి చర్యల కారణంగా మన ప్రాంతం మరింత అంధకారంలోకి వెళుతోంది. యుద్ధం నానాటికీ తీవ్రమవుతుంది. ఇరాన్ నిరంకుశ పాలకులు మీ భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదని మీలో చాలామందికి తెలుసు. హెజ్ బొల్లకు చెందిన హంతకులు.. అత్యాచారం చేసే వారిని మీరుసమర్థించరని తెలుసు. అందుకే ఇరాన్ కీలుబొమ్మలను మేం ఒక్కొక్కటిగా పెకిలించి వేస్తున్నాం. మా దేశ ప్రజల్ని రక్షించుకోవటం కోసం మేం ఎంత దూరమైనా వెళతాం. త్వరలోనే నిరంకుశ పాలన నుంచి మీకు విముక్తి కల్పిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని తన సందేశాన్ని వినిపించారు.