మీరు సీఎంగా ఉన్న వేళలో జరిగిన ఈ 5 దారుణాల మాటేంటి జగన్?
మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా బ్రహ్మారెడ్డిని నియమించారు చంద్రబాబు.
By: Tupaki Desk | 20 July 2024 4:46 AM GMTముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజుల్లో ఏపీలో ఏదేదో జరిగిపోయిందని.. దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని గగ్గోలు పెడుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా చూశామా? మరెక్కడైనా విన్నామా? అన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. గణాంకాల్ని వల్లె వేస్తూ.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల గురించి ఏకరువు పెడుతున్న ఆయన.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో జరిగిన దారుణాల మాటేమిటి? కార్యకర్తల సంగతిని పక్కన పెడదాం.. మాచర్ల నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఐదేళ్లలో జరిగిన అక్కడ జరిగిన ఐదు అమానుష ఘటనల్ని చూస్తే.. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల ఏం జరిగిందన్నది ఎవరికి వారు గుర్తు తెచ్చుకోవటం మంచిది.
మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా బ్రహ్మారెడ్డిని నియమించారు చంద్రబాబు. ఆయనకు మాచర్ల పట్టణంలో ఇల్లు అద్దెకు దొరకకుండా చేయటం.. చివరకు అద్దెకు దొరికిన కార్యాలయాన్ని సైతం నిర్దాక్షిణ్యంగా నిప్పు పట్టేసిన వైనం ఒక్కటే కాదు.. మంటలు ఆర్పేందుకు వస్తున్న ఫైరింజ్ ను సైతం ఘటనాస్థలానికి రాకుండా అడ్డుకోవటం లాంటి ఘటనల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుర్తు చేసుకోరు? అన్నది ప్రశ్న. ఇలా చెప్పుకుంటూ పోతే వేలకు వేల ఉదంతాలు వరుస కడతాయి. ఈ దారుణాలకు సంబంధించి ఎవరినో ఏదో అడిగే కన్నా.. సింఫుల్ గా గూగులమ్మను అడగాలే కానీ.. ఆధారాలకు ఆధారాలు కళ్ల ముందుకు వచ్చేస్తాయి.
ఇన్ని చెబుతున్నారు కదా? హింసకు మీరు అనుకూలమా? అంటే అస్సలు కాదనే చెప్పాలి. అలాంటి తీరును అంగీకరించేందుకు మనసు ఒప్పదు. కాకపోతే.. కొన్ని ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు దాని వెనకున్న చరిత్రను అర్థం చేసుకోకుండా మాట్లాడటం తప్పు అవుతుంది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఏం చేయాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. గతాన్ని గుర్తు చేసుకోవటం చాలా అవసరం.
ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ఏం జరిగింది? ఆయన ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటిని కాకున్నా.. మచ్చుకు ఐదు ఉదంతాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి ఏదైనా రోగం బారిన పడితే.. దానికంటూ ఏదో ఒక కారణం ఉంటుంది. దాన్ని గుర్తించకుండా రోగానికి మందు ఇవ్వటం తాత్కాలికంగా సర్దుకుంటుంది కానీ తర్వాత తిరగబెడుతుంది. అలానే.. మన కళ్ల ముందు కనిపించే హింస వెనకున్న చరిత్రను తెలుసుకోవటం ద్వారా.. దానికి అవసరమైన చికిత్స ఏమిటన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇక.. జగన్ ఐదేళ్ల పాలనలో మర్చిపోలేని ఐదు దారుణ హింసాత్మక ఘటనల్ని చూస్తే..
ఒకటో హింస
2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రయ్యను నడిరోడ్డు మీద.. పట్టపగలు వైసీపీ నాయకులు గొంతు కోసి హత్య చేశారు. అంతేకాదు.. గొంతు కోసే సమయంలో జై జగన్ అని అంటే వదిలేస్తామంటే.. జై తెలుగుదేశం అన్నందుకు మరో ఆలోచన లేకుండా గొంతు కోసేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం తన ప్రసంగాల్లో చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రెండో దారుణం
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జి బ్రహ్మారెడ్డి పట్టణంలో ఇంటి కోసం ప్రయత్నించగా.. ఆయనకు అద్దెకు ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. అతి కష్టమ్మీదా మాచర్ల శివారులోని సొసైటీ కాలనీలో ఇంటిని.. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న బహుళ అంతస్థుల భవనంలో బ్రహ్మారెడ్డి ఉండేవారు. తమ మాటకు భిన్నంగా బ్రహ్మారెడ్డి ఇంటిని తీసుకోవటం.. పార్టీ ఆఫీసును ఓపెన్ చేయటంతో వైసీపీ వర్గాలు రగిలిపోయాయి. దాదాపు రెండు వందల మంది ఇంటిని.. పార్టీ ఆఫీసును ముట్టడించటమే కాదు.. దాదాపు మూడు గంటల పాటు కర్రలతో.. పెట్రోల్ సీసాలతో అరాచకాన్ని ప్రదర్శించారు.
ఈ క్రమంలో సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్లను రియల్ లైఫ్ లో అందరికి చూపించేశారు. ఇంటిని.. కార్యాలయాన్ని ధ్వంసం చేయటం.. ఇంట్లోని సామాగ్రిని బయటకు తీసుకొచ్చి పడేశారు. అనంతరం నిప్పు పెట్టేశారు. పార్టీ కార్యాలయానికి సైతం నిప్పు పెట్టేశారు. దీంతో.. ఫైరింజన్ కు ఫోన్ చేయగా.. అది బయలుదేరింది. ఇంటికి వస్తున్న క్రమంలో ఒక ఫోన్ కాల్ రావటంతో.. ఫైరింజన్ రాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయింది. దీంతో.. పక్క రోజు ఉదయం వరకు మంటల్లో పార్టీ ఆఫీసు తగలబడుతూనే ఉంది. అంతేనా.. ఇంటి ముందున్న నాలుగు వాహనాల్ని ధ్వంసం చేశారు. ఆ బిల్డింగ్ లోని ఉన్న టీడీపీ వారి ఇళ్లకు వెళ్లి విధ్వంసాన్ని క్రియేట్ చేశారు.
మూడో ఆరాచకం
2020లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాచర్లలో కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ పరిస్థితిని పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి టీడీపీ నేతల్ని నియోజకవర్గాలకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు లాంటి నేతలు.. వారి అనుచరులు కలిసి మాచర్ల బయలుదేరారు.
మాచర్ల మొయిన్ రోడ్డు మీద వెళుతున్న టీడీపీ నేతల వాహనాలపై కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ గా మారి.. పలువురిని షాక్ కు గురి చేసింది. బోండా ఉమ పేరుతో రిజిస్టర్ అయిన వాహనంపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. పట్టపగలు నడిరోడ్డు మీద ప్రజలంతా చూస్తున్నప్పుడే ఇంత దారుణ దాడి జరిగింది. పక్కన గన్ మెన్ ఉండగానే దాడికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న తురక కిషోర్ ను తర్వాతి కాలంలో పురపాలక సంఘం ఛైర్మన్ ను చేయటం విశేషం.
నాలుగో దుర్మార్గం
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఓటు వేశారన్న కారణంగా దుర్గి మండలం ఆత్మకూరు.. జంగమహేశ్వర పాడు గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను గ్రామ బహిష్కరణ చేశారు. అయినప్పటికీ కొందరు గ్రామంలోనే ఉండగా.. నూతన సంవత్సర వేడుక సందర్భంగా టీడీపీ వారిపై వైసీపీ వారు దాడి చేసి పలు కుటుంబాలను గ్రామం నుంచి వెళ్లిపోయేలా చేశాయి.
ఐదో అన్యాయం
2020లో వెల్దుర్తి మండలం బోదిలవీడు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా అభ్యర్థి చేతిలోని నామినేషన్ పత్రాల్ని వైసీపీ నాయకులు లాక్కొని పత్రాల్ని చించేశారు. అయినా.. ఎలాంటి చర్యా తీసుకోలేదు.