Begin typing your search above and press return to search.

వెయిటర్, బౌన్సర్, కమెడియన్... ఆసక్తికరంగా దేశాధినేతల ఫ్లాష్ బ్యాక్!

అవును... పలువురు వ్యక్తులు ఇప్పుడు దేశాధినేతలుగా, ప్రపంచం ప్రశంసలు పొందిన నాయకులుగా మారారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 9:30 AM GMT
వెయిటర్, బౌన్సర్, కమెడియన్... ఆసక్తికరంగా  దేశాధినేతల ఫ్లాష్  బ్యాక్!
X

సక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవని అంటారు. కష్టపడితే ప్రయోజనం తప్పకుండా వస్తుందని చెబుతారు. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి అని కలాం చెప్పిన మాటలను గుర్తు చేస్తుంటారు. ఈ క్రమంలో... నేడు దేశాధినేతలుగా ఉన్న కొంతమంది నాయకులు తొలుత చిన్న చిన్న పనులు చేసుకున్నవారే కావడం గమనార్హం!

అవును... పలువురు వ్యక్తులు ఇప్పుడు దేశాధినేతలుగా, ప్రపంచం ప్రశంసలు పొందిన నాయకులుగా మారారు. అయితే.. వారిలో చాలా మంది టీచర్ గా, వెయిటర్ గా, బౌన్సర్ గా పని చేస్తూ కెరీర్ స్టార్ట్ చేశారనే విషయం తెలుసా? వారు ఎవరెవరు అనేది ఇప్పుడు చూద్దాం...!

నరేంద్ర మోడీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తన చిన్నతనంలో టీ విక్రయించేవారనే సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. వాద్ నగర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారమ్ లో తన తండ్రి టీ స్టాల్ లో మోడీ తన చిన్నతనంలో పనిచేసేవారని చెబుతుంటారు. ఆయన... నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు మూడో దఫా ప్రధానమంత్రిగా ఉన్నారు.

జో బైడెన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాక.. ఓ లా సంస్థలో క్లర్క్ గా పనిచేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ ప్లీడర్ గా వ్యవహరించారు. కొన్నేళ్ల తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధ్యక్షుడయ్యారు.

తొలుత న్యాయవాద వృత్తి చేపట్టిన జో బైడెన్ కు నత్తి ఉండేది. స్పష్టంగా మాట్లాడలేకపోయేవారంట. అయితే అద్దం ముందు కవితలు చెప్పడం ద్వారా దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేశారని చెబుతుంటారు.

బరక్ ఒబామా: అమెరికా అధ్యక్షుల్లో మంచి పాలకుడిగా పేరు సంపాదించుకున్న వారిలో బరక్ ఒబామా ఒకరని అంటారు. యుక్త వయసులో మద్యం, గంజాయి, కొకైన్ లను ఉపయోగించినట్లు చెప్పిన ఒబామా.. తర్వాత వాటిని పక్కన పాడేశారు.

బీఏ పూర్తి చేసిన తర్వాత ఓ కంపెనీలో ఫైనాన్షియల్ రీసెర్చర్ గా పనిచేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రంలో పట్టా అందుకుని.. లా కాలేజీలో లెక్చరర్ గానూ పనిచేశారు. అనంతరం ఇల్లినాయిస్ సెనెట్ కు ఎంపిక దేశ అధ్యక్షుడిగా తనదైన పాలన అందించారు ఒబామా!

రిషి సునాక్: భారత మూలాలున్న యునైటెడ్ కింగ్ డమ్ మాజీ ప్రధాని రిషి సునాక్... డిగ్రీ చదువుతున్న సమయంలో హోటల్ వెయిటర్ గా పనిచేశారు. అనంతరం ఎంబీయే పూర్తి చేసి గోల్డ్ మ్యాన్ సాచ్స్ అనే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ లో అనలిస్ట్ గా పనిచేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే కంజర్వేటివ్ పార్టీలో సభ్యుడయ్యారు.

వ్లాదిమిర్ జెలెన్ స్కీ: ప్రస్తుతం రష్యాతో అవిరామంగా యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ.. టీనేజ్ లో కామెడీ షో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కమెడియన్ గానూ నటించారు. నిర్మాతగాను పలు టీవీ షోలు నిర్మించారు. అనంతరం పాలిటిక్స్ లోకి వచ్చి అధ్యక్షుడయ్యారు.

జస్టిన్ ట్రూడో: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లపాటు వాంకోవర్ నగరంలో ఉంటూ పలు పాఠశాలల్లో టీచర్ గా పనిచేశారు. ఇదే సమయంలో నైట్ క్లబ్ లో బౌన్సర్ గానూ, రివర్ గైడ్ గానూ పనిచేశారు. స్టూడెంట్ గా ఉన్నప్పటినుంచే లిబరల్ పార్టీ మెంబర్ గా ఉన్నారు.