Begin typing your search above and press return to search.

నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ నో.. బ్యానర్లు ఏర్పాటు!

వినాయక చవితి అనంతరం గణేశ్ విగ్రహాల నిమజ్జన వేళలో హుస్సేన్ సాగర్ లో వేసే అలవాటు చాలామంది హైదరాబాదీలకు ఉంటుంది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 1:03 PM GMT
నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ నో.. బ్యానర్లు ఏర్పాటు!
X

ఆగస్టు వచ్చిందంటే చాలు పండుగల సందడి షురూ అయినట్లే. శ్రావణ శకుక్రవారాలతో మొదలై.. భాద్రపదంలో వినాయక చవితితో సందడి మరింత పెరుగుతుంది. దీపావళి వరకు వరుస పండుగలతో వాతావరణం మొత్తం ఉత్సాహవంతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఎంత భారీగా సాగినా.. హైదరాబాద్ లో ఉండే హడావుడితో పోలిస్తే తక్కువే. వినాయక చవితి అనంతరం గణేశ్ విగ్రహాల నిమజ్జన వేళలో హుస్సేన్ సాగర్ లో వేసే అలవాటు చాలామంది హైదరాబాదీలకు ఉంటుంది.

అయితే.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సాగర్ లో విగ్రహాల నిమజ్జనాలకు పర్మిషన్ లేదంటూ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల్ని పడేయకుండా ఉండేలా చుట్టూ ఇనుప కంచెల్ని ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైడ్రాను కూడా చేర్చాలని కోరారు.

హుస్సేన్ సాగరర్ పరిరక్షణ బాధ్యతల్ని హైడ్రా నిర్వహిస్తోందన్న పిటిషనర్.. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయట్లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ ఎత్తైన ఇనుప కంచెల్ని ఏర్పాటు చేసి.. నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ నిర్ణయంపై భాగ్యనగరి గణేశ్ ఉత్సవ సమితి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం చేయొద్దని చెప్పటానికి అధికారులు ఎవరు? అని ప్రశ్నిస్తూ.. హుస్సేన్ సాగర్ లోనే గణేశ్ నిమజ్జనం చేస్తామన్న గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు.. ‘‘వాళ్లు చెప్పేది వాళ్లు చెబుతారు. మేం చేసేది మేం చేస్తాం. హుస్సేన్ సాగర్ అంటేనే వినాయక సాగర్. గణేష్ నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందని అంటున్నారు.మరి.. నాలాల ద్వారా వచ్చే కెమికల్ వాటర్.. డ్రైనేజీ నీళ్లతో సాగర్ మరింత కలుషితం అవుతుంది. మొదట దాన్ని అడ్డుకోవాలి. ప్రతిసారి గణేష్ ఉత్సవాల సమయంలో హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేయవద్దని గందరగోళం సృష్టిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా హుస్సేన్ సాగర్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తాం’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మరాయి.