Begin typing your search above and press return to search.

విమానానికి భారీ రంధ్రం.. గాల్లో చక్కర్లు.. వీడియో వైరల్!

ఇటీవల విమాన ప్రయాణాల్లో జరుగుతున్న ప్రమాదకరమైన సంఘటనలకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2024 5:12 AM GMT
విమానానికి  భారీ రంధ్రం.. గాల్లో చక్కర్లు.. వీడియో వైరల్!
X

ఇటీవల విమాన ప్రయాణాల్లో జరుగుతున్న ప్రమాదకరమైన సంఘటనలకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డోర్ లు ఊడిపడిపోవడం వంటి ఘటనలు కూడా తెరపైకి వచ్చాయి! ఈ నేపథ్యంలో తాజాగా టేకాఫ్‌ అవుతున్న క్రమంలో రన్‌ వే సమీపంలో ఉన్న లైట్ ల సెట్ ను ఢీకొన్న ఘటనలో ఎడమవైపు భాగం తీవ్రంగా ధ్వంసమైన విమానం.. అలా గాల్లో గంటకు పైగా చక్కర్లు కొట్టిన సంఘటన తెరపైకి వచ్చింది.

అవును.... సెర్బియాలోని బెల్‌ గ్రేడ్‌ లోని ఒక కమర్షియల్ జెట్ టేకాఫ్ సమయంలో రన్‌ వే లైట్ల సెట్‌ ను తాకింది. దీంతో దాని ఫ్యూజ్‌ లేజ్‌ లో రంధ్రం పడింది. అయినప్పటికీ సుమారు గంట సేపు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం అత్యవసర ల్యాండింగ్‌ చేసింది. ప్రయాణికుల విమానానికి పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ విమానానికి పడిన రంధ్రానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

సెర్బియా విమానయాన వార్తా సంస్థ టాంగో సిక్స్ ప్రకారం... గ్రీక్ క్యారియర్ మారథాన్ ఎయిర్‌ లైన్స్ చేత నిర్వహించబడుతున్న ఎయిర్ సెర్బియా ఫ్లైట్ "జేయూ324".. జర్మనీలోని డ్యూసెల్‌ డార్ఫ్‌ కు బయలుదేరింది. ఈ క్రమంలో రన్‌ వేపై సగం దూరంలో ఉన్నప్పుడు టేకాఫ్ కోసం రోలింగ్ ప్రారంభించింది. ఈ సమయంలో రన్‌ వే సమీపంలో ఉన్న పరికరాలను ఢీకొంది.

106 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం టేకాఫ్‌ సమయంలో తగినంత ఎత్తుకు చేరుకోకపోవడంతో రన్‌ వే కి చివరన ఉన్న "ల్యాండింగ్‌ సిస్టం అరే"ను ఢీకొంది. ఈ ఘటనలో ఎడమవైపు రెక్క భాగం తీవ్రంగా ధ్వంసమై, భారీ రంధ్రం పడటంతో పాటు... విమానం బాడీ చీరుకుపోయినట్లు, వెనుక భాగం కూడా ధ్వంసమైనట్లు దృశ్యాలు వీడియోలు కనిపిస్తున్నాయి.

ఈ సమయంలో అలా రంధ్రంతోనే గాల్లోకి దూసుకెళ్లిన విమానం.. గంట తర్వాత అదే విమానాశ్రయంలో అత్యవసరంగా, సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. గాల్లో ఉన్న సమయంలో విమానం కంపించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ పరిణామంతో బెల్‌ గ్రేడ్‌ ఎయిర్ పోర్ట్ ను కాసేపు మూసివేశారు.