ఈ వీక్ లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్న వారికి నోట మాట రావట్లేదు
ఈ వీకెండ్ లో దేశీయంగా విమాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి దిమ్మ తిరిగిపోయేలా ధరల షాక్ తగులుతోంది.
By: Tupaki Desk | 11 Aug 2023 4:13 AM GMTకరోనా మహమ్మారి తర్వాత త్వరగా కోలుకున్న రంగాల్లో దేశీయ విమానయానం ఒకటి. లాక్ డౌన్ తదితర పరిణామాల వేళ దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పటికి.. త్వరగా రికవరీ మోడ్ లోకి వెళ్లిన విమానయాన రంగం.. ఇప్పుడు కళకళలాడుతోంది. దేశీయంగా విమాన ప్రయాణాల జోరు భారీగా పెరిగింది. దీంతో.. కరోనా పూర్వ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా.. కరోనా తర్వాత పెరిగిన ధరల మంటలకు తాజాగా పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు ధరలు భగ్గు మంటున్నాయి.
ఈ వీకెండ్ లో దేశీయంగా విమాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి దిమ్మ తిరిగిపోయేలా ధరల షాక్ తగులుతోంది. ఈ శనివారం.. ఆదివారం డొమెస్టిక్ ప్రయాణాలు చేయాలనుకునే వారంతా ధరల మంటలకు నోట మాట రాకుండా పోతున్న పరిస్థితి. దేశీయంగా పలు రూట్లలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నిఅంటేశాయి. ఇంతకాలం నాలుగు అంకెలుగా ఉన్న టికెట్ ధరలు తాజాగా ఐదు అంకెల్లోకి మారిపోతున్న పరిస్థితి.
దీనికి కారణం పంద్రాగస్టు. ఈసారి ఆగస్టు 15న మంగళవారం రావటం. శుక్రవారం సాయంత్రం ప్రయాణం ఉండేలా చూసుకుంటే.. శని..ఆది.. సోమ.. మంగళవారం వరుస సెలవులతో లాంగ్ వీకెండ్ కు పలువురు ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యలో ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే.. ఏకంగా నాలుగు రోజులు సెలవుల్లో గడిపే వీలు ఉండటంతో.. ఎవరికి వారు విమాన ప్రయాణాలవైపు మొగ్గు చూపుతున్నారు.
దీంతో.. విమాన ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా టికెట్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ శని.. ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి తిరుపతి టికెట్ ప్రారంభ ధర రూ.8వేలకు పైనే ఉండటం దీనికో ఉదాహరణ. పంద్రాగస్టు కారణంగా వస్తున్న లాంగ్ వీకెండ్.. విమాన ప్రయాణాలు చేసే వారికి మాత్రం మంట పుట్టేలా మారింది.