Begin typing your search above and press return to search.

ఆ సిటీలో ఫ్లిప్ కార్ట్ వారి రూపాయికే ఆటో రైడ్.. మిగిలిన సిటీల మాటేంటి?

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వినూత్న రీతిలో ఒక ఆఫర్ ను ప్రకటించింది. అదేమంటే.. రూపాయి అంటే ఒక్క రూపాయితోనే ఆటో రైడ్ ను ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   3 Oct 2024 7:30 AM GMT
ఆ సిటీలో ఫ్లిప్ కార్ట్ వారి రూపాయికే ఆటో రైడ్.. మిగిలిన సిటీల మాటేంటి?
X

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వినూత్న రీతిలో ఒక ఆఫర్ ను ప్రకటించింది. అదేమంటే.. రూపాయి అంటే ఒక్క రూపాయితోనే ఆటో రైడ్ ను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ ఊరించే ఆఫర్ కేవలం గార్డెన్ సిటీ అదేనండి బెంగళూరు వరకు మాత్రమే పరిమితం కావటం గమనార్హం. ఒక రూపాయికే ఆటో రైడ్ ఉచితమన్న మాటతో ఆటోల్లో ప్రయాణించేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. దీంతో.. బెంగళూరు రోడ్ల మీద సందడి వాతావరణం నెలకొంది.

అయితే.. ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలంటే కచ్ఛితంగా బెంగళూరు వాసులే అయి ఉండాలన్న కండీషన్ పెట్టారు. ఈ ఆఫర్ నేపథ్యంలో స్థానిక ఆటో డ్రైవర్లతో కలిసి టెక్ క్యాపిటల్ లో ప్రచారాన్ని ప్రారంభించారు. యూపీఐ చెల్లింపుల్ని ప్రోత్సహించటానికి వీలుగా ఈ ఆఫర్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

బిగ్ బిలియన్ డేస్ సేల్ మరింత ఉత్సాహాన్ని నింపేందుకు కూడా రూపాయి ఆటో రైడ్ ఆఫర్ ను ప్రకటించినట్లుగా చెబుతున్నారు. రూపాయికే ఆటో రైడ్ కావటంపై బెంగళూరు వాసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫ్లిప్ కార్ట్ కు థ్యాంక్స్ చెబుతున్నారు. అంతా బాగుంది కానీ.. ఒక్కటే అభ్యంతరం. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఫ్లిప్ కార్ట్ వ్యాపారం చేస్తున్నప్పుడు.. ఇలాంటి బంఫర్ ఆఫర్ ఒక్క బెంగళూరు సిటీకే పరిమితం చేయటం ఏమిటి? మిగిలిన నగరాల్లో కొన్నింటికైనా ఈ ఆఫర్ ను ప్రకటించొచ్చు కదా? అన్న మాట వినిపిస్తోంది. నిజమే కదా? ఆ వాదనలో న్యాయం ఉంది కదా?