నడుములోతు నీటిలో రయ్ మంటూ కిమ్ కారు కారణం ఇదే!
అవును... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తన ఖరీదైన లగ్జరీ కారులో ఏకంగా నడుములోతు నీటిలోకి వెళ్లారు.
By: Tupaki Desk | 29 July 2024 11:01 AM GMTప్రపంచ వ్యాప్తంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన ఏ వార్త వెలుగులోకి వచ్చినా అది వైరల్ గా మారుతుందనే సంగతి తెలిసిందే! అతని పాలన, అతడు తీసుకునే నిర్ణయాలు, అమలుచేసే ఆంక్షలు, విధించే శిక్షలు నిత్యం చర్చనీయాంశం అవుతుంటాయి. ఈ క్రామంలో తాజాగా నడుములోతు నీటిలోకి కారుతో వెళ్లారు కిమ్. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తన ఖరీదైన లగ్జరీ కారులో ఏకంగా నడుములోతు నీటిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో... ప్రస్తుతం వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ఆయన ఇలా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలో కిమ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
ప్రస్తుతం ఉత్తర కొరియాలోని సినాయ్జూ, యిజు అనే పట్టణాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 విమానాల్లో సుమారు 5,000 మందిని తరలించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కిమ్ ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లారని పేర్కొంటూ... నడుములోతు నీటిలో కారులో ప్రయానిస్తున్న ఫోటోలను స్థానిక మీడియా ప్రచురించింది.
వాస్తవానికి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించడానికి నేతలు హెలీకాప్టర్లలో వెళ్తుంటారు. అయితే.. విమానాలు, హెలీకాప్టర్లూ ఉన్నప్పటికీ కిమ్ ఇలా నడుములోతు నీటిలో రోడ్డు మార్గంలోనే ఎందుకు వెళ్లినట్లో అనే చర్చ మొదలైంది. దీంతో... ‘ఇది కిమ్ మార్కు పబ్లిసిటీ స్టంట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'ప్రజలపై ఉన్నట్లుండి కిమ్ కి ప్రేమ పెరిగిందా ఏమిటి? మరొకరి రియాక్షన్!
కాగా.. కయిసాంగ్ నగరంలో ఈ నెలలో ఒక్కరోజులోనే సుమరు 18.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో... గత 29 - 30 ఏళ్లలో ఉత్తర కొరియాలో ఇంతటి వర్షాలు ఎప్పుడూ చూడలేదని దక్షిణ కొరియా వాతావరణ శాఖ చెబుతోంది. వాస్తవానికి ఉత్తర కొరియాకు సంబంధించిన ఏ విషయమైనా బయట ప్రపంచంలోకి రావాలంటే... అందుకు కిమ్ & కో అనుమతి కచ్చితంగా ఉండాలని అంటారు. అందుకే అక్కడి విషయాలు గరిష్టంగా బయట ప్రపంచానికి తెలియదు!