పబ్జీ ప్రేమ... ఈసారి ఇండియాకు అమెరికా మహిళ!
ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి నలుగురు పిల్లలను వెంటపెట్టుకుని భారత్ కు వచ్చిన సీమా హైదర్ సంఘటన గుర్తుండే ఉంటుంది
By: Tupaki Desk | 16 Jun 2024 6:59 AM GMTప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి నలుగురు పిల్లలను వెంటపెట్టుకుని భారత్ కు వచ్చిన సీమా హైదర్ సంఘటన గుర్తుండే ఉంటుంది. ఆన్ లైన్ లో పరిచయమైన ప్రియుడి కోసం... పాకిస్థాన్ లోని భర్తకు విడాకులిచ్చి, వాటాగా వచ్చిన ఇంటిని అమ్ముకుని, డబ్బులను, పిల్లలను తీసుకుని పాక్ నుంచి ఇండియాకు వయా దుబాయ్ వచ్చేసింది. ఈటైపు లోనే తాజాగా యూఎస్ నుంచి ఓ మహిళ ఇలానే ఇండియాకు వచ్చేసింది.
అవును... పాకిస్థాన్ నుంచి ప్రియుడి కోసం పిల్లలతోపాటు ఇండియాకు వచ్చిన సీమ హైదర్ వ్యవహారంలాగానే మరో వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ఒక మహిళ పబ్జీ గేం లో పరిచయమైన ప్రియుడి కోసం భారతదేశానికి వచ్చేసింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసముంటున్న బ్రూక్లిన్ (30) కు ఉత్తరప్రదేశ్ లోని ఇటావా ప్రాంతానికి చెందిన హిమాన్షు యాదవ్ అనే వ్యక్తి పబ్జీ ఆడుతూ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం హిమాన్షుని కలవడానికి బ్రూక్లీన్ ఛండీగఢ్ కు వచ్చింది. హిమాన్షు ఆమెను కలుసుకున్నాడు.. ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు చండీగఢ్ లో గడిపిన తర్వాత.. బ్రూక్లీన్ ని తన స్వస్థలమైన ఇటావాకు తీసుకువచ్చాడు హిమాన్షు. అయితే... ఇటావా నివాసితులు తమ గ్రామంలో ఒక విదేశీమహిళను చూసి ఆశ్చర్యం కంటే ఎక్కువగా అనుమానించారట. అనంతరం... హిమాన్షు తనతో ఒక విదేశీ మహిళను బలంవంతంగా తీసుకువచ్చాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ సమయంలో దంపతులిద్దరూ ఆర్టీసీ బస్సు ఎక్కడంతో... డ్రైవర్, కండక్టర్ కూ అనుమానం వచ్చింది. దీంతో వారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు సమాచారం అందించారు. అనంతరం అతని ఆదేశాల మేరకు బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో... పోలీసులు బ్రూక్లిన్, హిమాన్షులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిద్దరినీ విచారించారు.
ఈ విచారణలో భాగంగా... హిమాన్షుతో వచ్చేందుకు బ్రూక్లిన్ ఇష్టపూర్వకంగా అంగీకరించిందని, ఈ విషయంలో హిమాన్షు నుంచి ఎలాంటి బలవంతం లేదని తేలిందట. ఇదే సమయంలో... హిమాన్షుతో కలిసి ఉండేందుకు ఆ మహిళ తన పూర్తి సమ్మతిని తెలిపిందని అంటున్నారు. దీంతో ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ సమస్య చక్కబడిందని చెబుతున్నారు. ఏది ఏమైనా... ఇదొక ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.