Begin typing your search above and press return to search.

ఆకాశంలో 'అనుమానం'.. అమెరికన్లు భయపడినంతా జరుగుతోందా?

రాత్రిళ్లు ఆకాశంలో ఏదైనా వెలుగుతూ కనిపిస్తే దానిని ఫ్లయింగ్ సాసర్ గానే భావిస్తుంటారు అమెరికన్లు. ఆ దేశంలో ఇటీవలి కాలంలో ఇలాంటి రెండో ఘటన చోటుచేసుకుంది.

By:  Tupaki Desk   |   14 Dec 2024 1:30 PM GMT
ఆకాశంలో అనుమానం.. అమెరికన్లు భయపడినంతా జరుగుతోందా?
X

‘‘అమెరికన్లు ఉగ్రవాదులకు కూడా భయపడరేమో కానీ.. ఎగిరే పళ్లేలు (ఫ్లయింగ్ సాసర్స్) అంటే మాత్రం వణికిపోతారు..’’ ఇది అందరూ సరదాగా చెప్పుకోనే మాట. అలాంటిదే ఇప్పుడు జరుగుతోంది. గ్రహాంతర వాసులు ఉన్నారనేది అమెరికన్ల ప్రగాఢ నమ్మకం. వేరే గ్రహం నుంచి వారు ఈ భూమ్మీదకు వస్తారనేది కూడా వారికున్న పెద్ద భయం. మన భూమిని స్వాధీనం చేసుకుంటారని కూడా ఊహించుకుంటుంటారు. అందుకే ఫ్లయింగ్ సాసర్ ల గురించి తెగ బెంగ పెట్టుకుంటుంటారు. అయితే, గ్రహాంతర జీవుల ఉనికిపై ఎలాంటి ఆధారాలూ లేవు. అలాగని అసలు వేరే గ్రహం మీద జీవమే లేదా? అని అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఏమో.. ఈ అనంత విశాల విశ్వంలో ఎక్కడో ఒకచోట జీవరాశి ఉనికి లేకుండా ఉండదు కదా? కాబట్టి అమెరికన్ల భయాందోళనలను మనం కొట్టిపారేయలేం.

కొద్ది రోజుల్లో రెండో ఘటన

రాత్రిళ్లు ఆకాశంలో ఏదైనా వెలుగుతూ కనిపిస్తే దానిని ఫ్లయింగ్ సాసర్ గానే భావిస్తుంటారు అమెరికన్లు. ఆ దేశంలో ఇటీవలి కాలంలో ఇలాంటి రెండో ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట యూఎఫ్‌వో తరహా డ్రోన్లు ఆకాశంలో ఎగిరాయి. అలాంటివే న్యూజెర్సీలో మరోసారి అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోలు దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఇరాన్ డ్రోన్లా? చైనా వదిలిందా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందనే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనపై హత్యాయత్నాలు జరగడం కూడా అనుమానాలకు తావిచ్చింది. అయితే, ఎన్నికలు సజావుగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, తాజా డ్రోన్లు ఇరాన్‌ నుంచే వచ్చాయని కొందరు, లేదు లేదు.. చైనా వదిలిందని మరికొందరు.. ఇవేవీ కాదు.. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పని ఇదని ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అసలు ఏదైనదీ తేల్చాలంటూ న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అధ్యక్షుడు బైడెన్ ను డిమాండ్‌ చేశారు.

కొసమెరుపు: డ్రోన్లు, గుర్తుతెలియని వస్తువులు ఎగరడం ట్రంప్ పనే అని కొందరు అంటుంటే.. ట్రంప్ మాత్రం ‘బైడెన్‌ కు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా? దీనిపై ప్రజలకు తెలియజేయండి. లేదంటే వాటిని కూల్చేయండి’ అని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో రాశారు. వైట్‌ హౌస్‌ నేషనల్‌ సెక్యూరిటీ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌ మాత్రం అవి మనుషులతో కూడిన విమానాలని, చట్టబద్ధంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.