ఏపీలో 10.30 లక్షల మందికి ఆహారం... ఈ ఫౌండేషన్ సేవలు అద్భుతః!
అవును... వరదలతో విలవిల్లాడుతున్న విజయవాడ ప్రజలకు ఆహారాన్ని సరఫరా చెయాలనే ప్రభుత్వ ఆలోచనకు తోడ్పాటుగా నిలిచింది అక్షయపాత్ర.
By: Tupaki Desk | 7 Sep 2024 7:44 AM GMTఏపీని వరదలు వణికించేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా బుడమేరు, కృష్ణా వరదల్లో చిక్కుకుని ఎంతోమంది బాధితులు విలవిల్లాడుతున్న పరిస్థితి. భోజనం అందడం లేదని, కొన్ని ప్రాంతాల్లో కనీసం మంచి నీళ్లు కూడా దొరకడం లేదని పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ సమయంలో అక్షయపాత్ర సేవలు కొనియాడబడుతున్నాయి.
అవును... వరదలతో విలవిల్లాడుతున్న విజయవాడ ప్రజలకు ఆహారాన్ని సరఫరా చెయాలనే ప్రభుత్వ ఆలోచనకు తోడ్పాటుగా నిలిచింది అక్షయపాత్ర. ఈ క్రమంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా అవిరామంగా శ్రమిస్తూ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఈ సమయంలో ఇప్పటివరకూ 10.30 లక్షల మందికి ఆహారాన్ని సరఫరా చేసింది అక్షయపాత్ర ఫౌండేషన్.
అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థ ఆహార తయారీ కేంద్రం మంగళగిరి సమీపంలో ఉంది. ఇక్కడ సాంబారు, సాంబార్ రైస్ సిద్ధం చేసే యంత్రాలు ఉన్నాయి. ఇక్కడ గంటన్నరలో సుమారు 45 వేల మందికి సరిపడా అన్నం సిద్ధం చేసేలా యంత్రాలను రూపొందించారు. ఇదే సమయంలో... రెండు నిమిషాల్లో 250 కిలోల పులిహోరను కలిపే యంత్రాలను అందుబాటులో పెట్టారు.
దీంతో... వరద బాధితులకు ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సంస్థను పురమాయించింది ఏపీ ప్రభుత్వం. వరద బాధితులకు గతంలోనూ అండగా నిలిచిన ఈ సంస్థ.. తాజా పరిస్థితులకు అనుగుణంగా బాధితులకు అండగా నిలుస్తుంది. సుమారు ప్రతీ నాలుగు గంటలకు లక్ష మందికి సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తుందని అంటున్నారు.
ఇలా వరద బాధితులకు మూడు పూటలా ఆహారాన్ని అందించేందుకు 275 మంది పనిచేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో రోజూ 60 వేల మందికి సరిపడా ఆహారాన్ని అందుబాటులో ఉంచుతూనే.. మరోపక్క వరద బాధితులకు ఎప్పటికప్పుడు ఆహారాన్ని అందించే పనులు చేస్తున్నారు.
ఇక ఇక్కడ రోజుకు 10 టన్నుల బియ్యం, 8 టన్నుల వెజిటబుల్స్, 5 టన్నుల కందిపప్పు, 2 టన్నుల ఉప్పు, 2 టన్నుల నూనె వినియోగిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడూ వారం రోజులకు సరిపడా నిత్యావసరాలను నిల్వ ఉండేలా చూసుకుంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఈ ఫౌండేషన్ ఏపీ సెంట్రల్ రీజియన్ అధ్యక్షుడు వంశీధరదాస... సీఎం చంద్రబాబు ఆదేశాలతో రోజూ 2.5 లక్షల మంది వరద బాధితులకు ఆహారం తయారుచేసి పంపుతున్నట్లు తెలిపారు. తొలిరోజు 60వేల మందికి ఆహారం అదించగా.. ఆ తర్వత రోజూ సుమారు 2.5 లక్షల మందికి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.