వీర్య కణాల సంఖ్య పెంచే ఆహారాలేంటో తెలుసా?
వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణాల్లో మద్యం, పొగ తాగే అలవాటు ప్రతిబంధకంగా మారుతుంది.
By: Tupaki Desk | 22 Dec 2023 11:30 PM GMTమానవ పుట్టుకకు వీర్య కణాలే కారణం. వీర్య కణాలు స్త్రీ అండంతో కలిస్తే బిడ్డ జన్మిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వంధత్వం పెరుగుతోంది. సంతాన సాఫల్యం దెబ్బతింటోంది. దీంతో చాలా మంది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారు. గర్భధారణలో సమస్యలు తలెత్తుతున్నాయి. దంపతుల్లో సంతాన భాగ్యం కలగాలంటే వీర్య కణాలు సమర్థవంతంగా ఉండాలి. లేకపోతే సంతానం కలగడం సాధ్యం కాదు. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణాల్లో మద్యం, పొగ తాగే అలవాటు ప్రతిబంధకంగా మారుతుంది. పొగాకు ఉత్పత్తుల్లో సుమారు 2 వేల రకాల రసాయనాలు ఉండటం వల్ల ధూమపానం సంతాన సాఫల్యత మీద పెనుప్రభావం చూపుతుంది. పురుషుల్లో ధూమపానం, మద్యపానం పలు సమస్యలను తెచ్చిపెడుతుంది. సంతాన భాగ్యం కావాలనుకునే వారు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
వీర్య కణాల సంఖ్య తగ్గడానికి మరో కారణం ఊబకాయం. వీర్య కణాల నాణ్యతను ఊబకాయం దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్యలను తెస్తుంది. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, హార్మోన్ల నిష్పత్తి మీద ప్రభావం కలిగిస్తుంది. అధిక బరువు సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వీర్య కణాల నాణ్యత పడిపోవడానికి ఊబకాయం మరో ప్రతిబంధకంగా ఉంటుంది.
నిద్రలేమి కూడా వీర్య కణాల సంఖ్య తగ్గేందుకు కారణం అవుతుంది. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవడం వల్ల మన వీర్య కణాల సంఖ్య పెరుగుతాయి. వీర్య కణాల చలనశీలత, నాణ్యత పెరగడానికి నిద్ర ఉపయోగకరంగా ఉంటుంది. మంచి నిద్ర పోవడం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. సంతాన సాఫల్యతను ప్రభావితం చేసే అంశాల్లో నిద్ర కూడా ఒకటి.
వీర్య కణాల సంఖ్యను పెంచే వాటిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు ముఖ్యమైనవి. రోజు వీటిని తినడం వల్ల వీర్య కణాల సంఖ్య పెరిగేందుకు దోహదం అవుతుంది. ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు తగ్గించుకోవాలి. చక్కెర అధికంగా ఉండే పానీయాలు తాగొద్దు. వాటి వల్ల కూడా నష్టమే కలుగుతుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం మానేయాలి.