పవర్ ఫుల్... ఎఫ్.ఎం.నిర్మలమ్మకు మరో అరుదైన ఘనత!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు.
By: Tupaki Desk | 13 Dec 2024 8:10 AM GMTకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా ను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో నిర్మలమ్మకు వరుసగా ఆరోసారి చోటు లభించడం గమనార్హం.
అవును... ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురు మహిళలు చోటు సంపాదించగా.. వారిలో నిర్మలా సీతారామన్ ఒకరు. గత ఏడాది 32వ స్థానంలో ఉన్న ఆమె... ఈ ఏడాది జాబితాలో 28వ స్థానంలో నిలిచారు. నిర్మలమ్మ తర్వాత రోష్నీ నాడార్ మల్హోత్రా, కిరణ్ మజుందర్ షా ఉన్నారు.
ఇందులో భాగంగా... భారత్ నుంచి హెచ్.సీ.ఎల్. కార్పొరేషన్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా గత ఏడాది 60వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 81వ స్థానం దక్కించుకున్నారు. ఇక బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా కూడా గత ఏడాదిలాగానే తాజా ఏడాది జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నారు. ఇందులో భాగంగా.. 82 స్థానంలో నిలిచారు.
ఇక.. ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డేర్ లెయెన్ నిలిచారు. గతంలోనూ ఆమె అగ్రస్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో... యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్ నిలవగా.. మూడో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిలిచారు.
కాగా.. భారత్ నుంచి ఈ జాబితాలో నిలిచిన ముగ్గురి మహిళల గురించి పరిశీలిస్తే... భారత్ లో తొలి, పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్.. రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్ అగ్రికల్చర్ ఇంజినీర్స్ అసోసియేషన్, బీబీసీ వరల్డ్ సర్వీసులలో కీలక పదవులు నిర్వర్తించారు.
ఇక హెచ్.సీ.ఎల్. వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా విషయానికొస్తే.. ఈమె 2020 జూలై లో హెచ్.సీ.ఎల్. ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వ్యూహాత్మక నిర్ణయాలతో కంపెనీని ముందుకు దుసుకుపోతూ ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదిస్తున్నారు.
ఇదే సమయంలో కిరణ్ మజూందర్ షా 1978లో షా బయోకాన్ ను నెలకొల్పారు. ఆ తర్వాతి కాలంలో ఆమె భారత్ లో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఎదుగుతూ వస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన టాప్ 10 మహిళలు!:
ఉర్సులా వాన్ డేర్ లెయెన్ - బెల్జియం
క్రిస్టిన్ లగార్డ్ - జర్మనీ
జార్జియా మెలోనీ - ఇటలీ
క్లాడియా షిన్ బామ్ - మెక్సికో
మేరీ బర్రా - యునైటెడ్ స్టేట్స్
అబిగైల్ జాన్సన్ - యునైటెడ్ స్టేట్స్
జూలీ స్వీట్స్ - యునైటెడ్ స్టేట్స్
మెలిండా ఫ్రెంచ్ గేట్స్ - యునైటెడ్ స్టేట్స్
మెకెంజీ స్కాట్ - యునైటెడ్ స్టేట్స్
జెన్ ఫ్రేజర్ - యునైటెడ్ స్టేట్స్