Begin typing your search above and press return to search.

శవాలను దాటుకుంటూ.. సవాళ్లను ఈదుకుంటూ.. అమెరికా నుంచి వలసదారుల ప్రయాస

సైనిక విమానంలో.. ఒకటే బాత్రూంలో.. వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఇదీ అమెరికా వెనక్కుపంపిన భారత వలసదారుల గాథ.. మరి దీనికి ముందు ఏం జరిగింది..?

By:  Tupaki Desk   |   6 Feb 2025 7:33 AM GMT
శవాలను దాటుకుంటూ.. సవాళ్లను ఈదుకుంటూ.. అమెరికా నుంచి వలసదారుల ప్రయాస
X

ఎలాగోలా పరాయి గడ్డకు చేరి.. అక్కడే కలో గంజో తాగుతూ.. కాయకష్టం చేసుకుంటూ.. వీలైతే చదువుకుంటూ జీవనం సాగించినవారంతా.. ఉన్నపళంగా కట్టుబట్టలతో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఒకే ఒక్క సంతకం పోటు వారిని దేశం నుంచి గెంటేసింది.. సైనిక విమానంలో.. ఒకటే బాత్రూంలో.. వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఇదీ అమెరికా వెనక్కుపంపిన భారత వలసదారుల గాథ.. మరి దీనికి ముందు ఏం జరిగింది..?

సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న విదేశీయులను ట్రంప్ సర్కారు అమెరికా నుంచి బలవంతంగా పంపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 205 మంది భారతీయులను సీ17 సైనిక విమానంలో తరలిస్తున్నట్లుగా రెండు రోజుల కిందట కథనాలు వచ్చాయి. అయితే, బుధవారం పంజాబ్ చేరిన విమానంలో 104 మంది మాత్రమే ఉన్నారు. అడ్డదారిలోనైనా అమెరికా కలలు నెరవేర్చుకోవాలని.. తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకుని వెళ్లినవారు. ఇప్పుడు వీరి భవిష్యత్తు ఏమీ తోచడం లేదు.

పంజాబ్‌ రాష్ట్రం హోషియాపుర్‌ జిల్లా తహ్లీ గ్రామ వాసి హర్వీందర్ సింగ్‌ అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానంటే ఓ ఏజెంట్‌ కు రూ.42 లక్షలు ఇచ్చాడు. కానీ, వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖతర్‌.. అనంతరం బ్రెజిల్ చేరాడు. చివరగా అమెరికా గడ్డపై కాలుమోపాడు. ట్రంప్ దెబ్బతో మళ్లీ మొదటికి వచ్చాడు.

బ్రెజిల్ నుంచి పెరూ విమానం ఎక్కిస్తామన్నారు. అదేమీ చేయలేదు. తర్వాత ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లి నౌక ఎక్కిస్తామన్నా అదీ లేదు. రెండురోజుల పాటు అక్రమమార్గంలో ప్రయాణించాం. తర్వాత పర్వతాల్లో వెళ్లాం. మెక్సికో సరిహద్దుకు చేరేందుకు చిన్న బోటులో కుక్కేశారు. 4 గంటలు ప్రయాణించాక బోటు తిరగబడి ఒకరు, పనామా అడవిలో మరొకరు చనిపోయారు’’ అని అతడు వాపోయాడు.

పంజాబ్ లోని దారాపుర్‌ గ్రామానికి చెందిన సుఖ్‌ పాల్‌ సింగ్‌ 15 గంటలు సముద్రంపై, 45 కి.మీ. పర్వతమార్గంలో ప్రయాణించాడు. ఈ క్రమంలో గాయాలైతే మరణమే అని.. దారిలో ఎన్నో మృతదేహాలు కనిపించాయని, కొద్దిసేపట్లో మెక్సికో దాటి అమెరికాలోకి చేరతామనగా జలంధర్‌ కు చెందిన ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. మా ప్రయణం వృథా అయింది’’ అని సుఖ్ పాల్ తెలిపాడు. 14 రోజులు చీకటి గదుల్లో బంధించారని సూర్యుడిని చూడనే లేదని చెప్పాడు. వేలాది పంజాబీ యువకులు, పిల్లలను చూశానని వారందరిదీ ఒక్కటే దుస్థితి అని చెప్పుకొచ్చాడు.

అమెరికా నుంచి వచ్చేసినవారిలో హరియాణా, గుజరాత్‌ కు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు. 30 మంది పంజాబీలు, మహారాష్ట్ర, యూపీలకు చెందినవారు ముగ్గురు చొప్పున, ఇద్దరు చండీగఢ్‌ వారు ఉన్నారు.

అమృత్‌సర్‌ చేరినవారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు.