గుజరాత్ లో ఘోరం... దర్గాలోకి బూట్లతో వచ్చారని..!
గుజరాత్ లోని వడోదర జిల్లాలోని దర్గాలోకి.. నలుగురు అంతర్జాతీయ విద్యార్థులు పాదరక్షలు ధరించి ప్రవేశించారు.
By: Tupaki Desk | 18 March 2025 1:05 PM ISTఇటీవల కాలంలో భారత్ లో పర్యటిస్తున్న విదేశీయులపై దాడులు జరుగుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే! ఇటీవల కర్ణాటకలోని గంగావరి ప్రాంతానికి వచ్చిన విదేశీయులపై కొందరు దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గుజరాత్ లో ఇలాంటి ఘోరం ఒకటి చోటు చేసుకుంది.
అవును... గుజరాత్ లోని వడోదర జిల్లాలోని దర్గాలోకి.. నలుగురు అంతర్జాతీయ విద్యార్థులు పాదరక్షలు ధరించి ప్రవేశించారు. దీంతో... వారిపై ఓ గుంపు దాడి చేసింది. విదేశీ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడం, స్థానిక ఆచారాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ దాడిలో ఓ విద్యార్థి తలకు తీవ్రంగా గాయమైందని.. ఇదే సమయంలో అతడి చేతులు, కాలుపైనా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా.. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలుస్తోంది. బాధితుడిని పరుల్ సేవాశ్రమ్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చినట్లు చెబుతున్నారు.
వాఘోడియా పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం... మార్చి 14 సాయంత్రం... థాయిలాండ్, సూడాన్, యునైటెడ్ కింగ్ డమ్, మొజాంబిక్ దేశాలకు చెందిన పారుల్ యూనివర్శిటీకి చెందిన నలుగురు అంతర్జాతీయ విద్యార్థులను.. లిమ్డా గ్రామంలో వారి హాస్టల్ కి సమీపంలో సుమారు 10 మంది వ్యక్తుల బృందం వెంబడించి దాడి చేసింది.
గుజరాతీ భాషలో.. దర్గా దగ్గర బూట్లు ధరించి నడవొద్దని స్థానిక వ్యక్తి చేసిన సూచనలను ఈ విదేశీ విద్యార్థులు అర్థం చేసుకోకపోవడంతోనే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ దాడి సమయంలో ముగ్గురు విద్యార్థులు తప్పించుకుని పారిపోగా.. థాయిలాండ్ కు చెందిన విద్యార్థి దొరికిపోయాడని.. అతడిపై క్రికెట్ బ్యాట్, కర్రలతో దాడి చేశారు!
దీంతో... నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వాఘోడియా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు.