విదేశీ విద్యపై మోజు.. అప్పుల భారంతో ఆందోళన
ఉన్నత చదువుల కోసం అమెరికా విమానమెక్కే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడాది ఏడాదికి క్రమంగా పెరుగుతూనే ఉంది
By: Tupaki Desk | 10 Aug 2023 8:22 AM GMTఉన్నత చదువుల కోసం అమెరికా విమానమెక్కే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడాది ఏడాదికి క్రమంగా పెరుగుతూనే ఉంది. ఉత్తమ విద్య కోసం, మంచి ఉద్యోగం, జీవితం దొరుకుతుందని డాలర్ల వేటలో పడొచ్చేనే ఉద్దేశంతో చాలా మంది మన విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు అప్పుల భారం ఆందోళన పెంచుతోంది. చదువు కోసం తీసుకున్న రుణాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసింది. లోన్లు లేని విద్యార్థుల కంటే రుణాలు తీసుకున్న విద్యార్థులు మానసిక పరిస్థితి దారుణంగా మారుతుందని తేలింది.
ఇలా లోన్లు తీసుకుని విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో 53 శాతం కుంగుబాటుకు లోనవుతున్నట్లు తెలిసింది. 90 శాతం మంది తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. అలాగే ప్రతి 15 మందిలో ఒకరు ఈ లోన్ల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ చేస్తున్నట్లు వెల్లడైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో విద్య కోసం భారతీయ విద్యార్థులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణం కింద రూ.7,576.02 కోట్లు అప్పులు ఇచ్చాయి. అంతకుముందు ఏడాది పోలిస్తే ఇది 68 శాతం పెరగడం గమనార్హం. ఇందులో 50 శాతం కంటే రుణాలు అమెరికా వెళ్లిన విద్యార్థులే తీసుకున్నారు.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణాలు తీసుకుని అమెరికా వెళ్తున్న విద్యార్థులు ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ఈ రుణాలు విద్యార్థులపైనే కాకుండా వీళ్ల తల్లిదండ్రులపైనా తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. అప్పు ఉందనే కారణంగా చాలా మంది విద్యార్థులు ఒంటరిగా ఉంటూ కుంగుబాటుకు లోనవుతున్నారు. ఇలాంటి ఆందోళన నుంచి తప్పించుకోవడానికి బ్యాంకు నుంచి క్రెడిట్ కౌన్సిలింగ్ సలహాలు తీసుకోవాలని, ఇతర వనరులను ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులపై మానసిక భారం తగ్గించేందుకు అవసరమైన విధానాలు రూపొందించాల్సి ఉందని అంటున్నారు. అంతే కాకుండా కుటుంబం, స్నేహితులతో ఈ విద్యార్థులు మనసు విప్పి మాట్లాడితే మానసికంగా మద్దతు దొరికే అవకాశం ఉందని చెబుతున్నారు.