'ఇండియా' పేరు మార్పుపై విదేశాంగ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్!
దేశానికి ఇండియా అనే పేరును తీసివేసి భారత్ అని పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 6 Sep 2023 9:15 AM GMTదేశానికి ఇండియా అనే పేరును తీసివేసి భారత్ అని పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ బిల్లులతోపాటు ఇండియా పేరు మార్పు బిల్లును కూడా ప్రవేశపెడతారని టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు ఈ అంశంపై చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు.
'ఇండియా అంటే భారత్ అని దేశ రాజ్యాంగంలో పేర్కొనబడింది' అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని విదేశీ నేతలకు భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపైనా జైశంకర్ స్పందించారు.
'ఇండియా అంటే భారత్ అని రాజ్యాంగంలోనే ఉంది. దయచేసి ప్రతి ఒక్కరినీ చదవమని నేను కోరుతున్నాను' అని జైశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్ అనే పదానికి ఒక అర్థం, అవగాహన ఉన్నాయన్నారు. ఇది మన రాజ్యాంగంలోనూ ప్రతిబింబిస్తోందని తెలిపారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలుపుతున్నారని గుర్తు చేశారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా విభిన్న భారతదేశాన్ని, విభిన్న ప్రభుత్వాన్ని, విభిన్న ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలు చూస్తున్నారని కొనియాడారు. భిన్న ధ్రువ ప్రపంచంలో భారత్ కూడా భిన్నంగా నిలుస్తోందన్నారు. ఇందుకు ప్రధాని మోడీ విధానాలే కారణమని ప్రశంసించారు. అందుకే ప్రజలు గతంలో చూడనివన్నీ ఇప్పుడు లభిస్తున్నాయని వెల్లడించారు.
భారత్.. జీ-20 దేశాలకు ఆతి«థ్యం ఇస్తోందన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. వారికున్న అభ్యంతరాలను, సందేహాలను తమకు చెప్పాలని కోరారు. వాటిని తాము నివృత్తి చేస్తామని.. వారు అడిగినవాటన్నింటికీ సమాధానం ఇస్తామని జైశంకర్ వెల్లడించారు.
జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల గైర్హాజరుపైన జైశంకర్ స్పందించారు. వారు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రపంచ సమావేశాలకు రాకూడదని నిర్ణయించుకున్నారు అని తెలిపారు. వారి తరఫున చైనా ప్రధానమంత్రి, రష్యా విదేశాంగ మంత్రి వస్తున్నారని చెప్పారు.