Begin typing your search above and press return to search.

మేడారం అడవుల్లో ఊహించని ఉత్పాత్తం ఇది..!!

అలాగే.. ఎక్కడెక్కడో అడవులతో పాటు ఊరిబయట సైతం మొక్కలు నాటే కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 12:30 PM GMT
మేడారం అడవుల్లో ఊహించని ఉత్పాత్తం ఇది..!!
X

పచ్చని చెట్లు.. ప్రగతి మెట్లు అని అంటుంటాం. చెట్లు ఎన్ని పెంచితే పర్యావరణానికి అంత మేలు అనేది వాస్తవం. అందుకే.. అడవుల పెంపునకు ప్రభుత్వాలు సైతం అంతటి ప్రాధాన్యతను ఇస్తుంటాయి. ఏటా వర్షాకాలానికి ముందు మొక్కల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంటాయి. వాటి సంరక్షణకు సైతం నిధులు ఇస్తాయి. పర్యవేక్షణకు అటవీశాఖ ఎలాగూ ఉంది. అలాగే.. ఎక్కడెక్కడో అడవులతో పాటు ఊరిబయట సైతం మొక్కలు నాటే కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోనూ చెప్పుకోదగిన అడవులు ఎన్నో ఉన్నాయి. నిత్యం పచ్చని చెట్లతో అడవులు కళకళలాడుతుంటాయి. వన్యప్రాణులు ఊళ్లలోకి రాకుండా వాటికి రక్షణగా నిలుస్తున్నాయి. అలాంటి అడవిలో ఒక్కసారిగా ఉత్పాతం నెలకొంది.

సుడిగాలులు చుట్టుముట్టి 50వేల చెట్లను నేలమట్టం చేశాయి. అడవిని పరిశీలించేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులు కుప్పకూలిన చెట్లను చూసి హతాశయులయ్యారు. అయితే.. టోర్నడోల్లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవి 200 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అడవిలో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాలులు రావడంతో ఏకంగా 50వేల చెట్లు కుప్పకూలాయి. టోర్నడోలు గంటకు కనీసం 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఒక స్పష్టమైన మార్గంలో అవి పయనిస్తాయి. అయితే.. భారీ వృక్షాలు కూడా పడిపోయిన విధానాన్ని బట్టి చూస్తుంటే ఒకవైపే పడి ఉన్నాయి. వేగంగా వీచిన గాలులే ఈ భయోత్పాదానికి కారణంగా కావచ్చని నిపుణులు అంటున్నారు.

మరోవైపు.. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంపైనా విచారణ చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. డీఎఫ్ఓ రాహుల్ జావెద్ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో కలిసి పరిశీలన చేస్తున్నారు. భారీ నష్టానికి గల కారణాలను వెతుకుతున్నారు.