CID మాజీ చీఫ్ సునీల్ కోసం పక్కా వ్యూహం? తులసిబాబు కంపెనీకి రూ. 3 కోట్లు చెల్లింపులు
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ అవినీతికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం మరో కేసును తెరపైకి తెచ్చింది.
By: Tupaki Desk | 20 Jan 2025 7:30 AM GMTసీఐడీ మాజీ చీఫ్ సునీల్ అవినీతికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం మరో కేసును తెరపైకి తెచ్చింది. పోలీసు హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టరుగా ఉండగా, డ్యాష్ బోర్డు తయారుచేసేందుకు టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా మూడు కోట్ల రూపాయలు చెల్లించారని ఆరోపిస్తూ మరో అభియోగం నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆయన సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది. తాజాగా అవినీతికి పాల్పడ్డారంటూ మరో అంశాన్ని వెలుగులోకి తేవడం ద్వారా ఎట్టిపరిస్థితుల్లోనూ సునీల్ కుమారును విడిచిపెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పంపినట్లైంది.
డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమారుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో ప్రభుత్వం ప్లాన్ బీ అమలు చేయాలని చూస్తోంది. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమారుపై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పంతం పట్టిందని అంటున్నారు. కార్యకర్తలు, నాయకుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉండటం, రఘురామ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లభించకపోవడంతో కొత్త కేసులు తెరమీదకు తెస్తోందని అంటున్నారు. దీంతో గత ప్రభుత్వంలో సునీల్ కుమారు జరిపిన ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది.
ప్రస్తుతం వీఆర్ లో ఉన్న సునీల్ కుమారుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. గత ప్రభుత్వంలో అప్పటి వైసీపీ పెద్దలు చెప్పినట్లు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ ను తేలిగ్గా వదలొద్దని కూటమి పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా బలమైన కేసులు పెట్టేలా వ్యూహం రచిస్తోంది. రఘురామ కేసు ఒకవైపు విచారణలో ఉండగానే, అవినీతి వ్యవహారాలను తవ్వితీస్తోంది. ఇందులో భాగంగా గతంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, వైస్ చైర్మనుగా పనిచేసిన సునీల్ కుమార్ ఆ శాఖకు డాష్ బోర్డు తయారు చేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం 2019 జనవరి 30న ఈ టెండర్లను ఆహ్వానించారు. అయితే ఈ టెండర్ల ఖరారులో నిబంధనలు పాటించలేదని తాజాగా ప్రభుత్వం గుర్తించింది.
ఒక టెండర్ ఖారారు కావాలంటే మూడు దరఖాస్తులు కచ్చితంగా రావాల్సివుంటుంది. అయితే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డ్యాష్ బోర్డు తయారీ కోసం కేవలం రెండు సంస్థలే దరఖాస్తు చేసుకున్నాయి. నిబంధనల ప్రకారం మరోమారు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సివుండగా, ఎండీ హోదాలో సునీల్ కుమార్ తుది నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. డ్యాష్ బోర్డు తయారీ కోసం మెగట్రాన్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వీఎస్ఎన్ ఇన్ఫో ప్రైవేటు లిమిటెడ్ దరఖాస్తు చేయగా, రెండో దానికి అర్హత లేదని ఆ దరఖాస్తును తోసిపుచ్చారు. దీంతో మెగట్రాన్ ఐటీ సర్వీసెస్ కు టెండర్ అప్పగించారు. ఈ సంస్థ రఘురామ కేసులో అరెస్టు అయిన కామినేని తులసిబాబుదిగా చెబుతున్నారు. తన అనుచరుడు కోసం సునీల్ కుమార్ టెండర్ నిబంధనలు పాటించలేదని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా డ్యాష్ బోర్డు తయారు చేయకుండానే రూ.3 కోట్లు చెల్లించారని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో సునీల్ కుమార్ పై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు.