వెంకట రెడ్డి నోరు విప్పారు.. పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది!
వెంకటరెడ్డి. ఏపీలో కొన్నాళ్లుగా వివాదంగా మారిన పేరు ఇది. వైసీపీ హయాంలో గనుల శాఖకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అధికారి.
By: Tupaki Desk | 28 Oct 2024 7:30 PM GMTవెంకటరెడ్డి. ఏపీలో కొన్నాళ్లుగా వివాదంగా మారిన పేరు ఇది. వైసీపీ హయాంలో గనుల శాఖకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అధికారి. అయితే.. ఆ నాటి కాలంలో వైసీపీ అస్మదీయులకు ఇసుక రీచ్‌లను అతి తక్కువ ధరలకే కట్టబెట్టారని పెద్ద ఎత్తున అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్లు పారిపోయారు. చివరకు హైదరాబాద్‌లో ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత.. ఆయనను విజయవాడకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరు పరిచారు.
దీంతో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. ఇటీవల రెండు రోజు ల పాటు కస్టడీకి తీసుకున్న అధికారులు ఆయన నుంచి పలు కీలక విషయాలను సేకరించారు. అనంత రం.. సర్కారు అనుమతితో ఆయా వ్యవహారాలపై దృష్టి పెట్టారు. తాజాగా గనుల శాఖ కార్యాలయంలోని రహస్య అల్మరాల్లో ఉంచిన ఫైళ్ల వివరాలను వెంకటరెడ్డి వెల్లడించినట్టు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆ ఫైళ్లను స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగారు.
ఏపీఎండీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన అధికారులు సదరు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించి.. ఆ నాటి ప్రభుత్వంలో ఇసుక అక్రమాల్లో జోక్యం ఉన్నట్టుగా భావిస్తున్న అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్రను తెలుసుకోనున్నారు. అనంతరం.. ఆయనను కూడా ఈ కేసులో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు వంటి కీలక జిల్లాల్లో వైసీపీఅనుకూల కంపెనీకి ఇసుక రీచ్ కట్టబెట్టారని.. తద్వారా అక్రమంగా సొమ్మును పోగేసుకున్నారని.. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు వెంకట రెడ్డి నోరు విప్పడంతో పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సొంత నియోజవర్గం పుంగనూరులోకి పెద్దిరెడ్డిని రాకుండా.. పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.