వెన్ను చూపని ఒకే ఒక్కడు అంబటి!
దీంతో వైసీపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత ఆ స్థాయిలో కార్యకర్తల అభిమానాన్ని అంబట దక్కించుకుంటున్నారు.
By: Tupaki Desk | 22 Dec 2024 12:30 AM GMTకూటమి ప్రభుత్వం దూకుడుతో వైసీపీలో చాలా మంది నేతలు బయటకు రాడానికే బయపడుతుంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు చూపిస్తున్నారు. కార్యకర్తల తరుఫున పోరాటానికి సిద్ధమంటున్నారు. దీంతో వైసీపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత ఆ స్థాయిలో కార్యకర్తల అభిమానాన్ని అంబట దక్కించుకుంటున్నారు.
ఆర్నెల్ల క్రితం వరకు తమకు తిరుగులేదన్నట్లు వ్యవహరించిన వైసీపీ నేతలు.. గత ఆర్నెల్లుగా అస్సలు బయటకు రావడమే మానేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా మంది ఇళ్లకే పరిమితయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో? అనే భయం వైసీపీలో సీనియర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా అధినేత జగన్ చూసుకుంటారు, తమకెందుకు లేనిపోని గొడవంటూ తప్పించుకుంటున్నారు. ఒకరిద్దరు మాజీ మంత్రులు తప్ప మిగిలిన నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. గత ఐదేళ్లు మీడియా సాక్షిగా విరుచుకుపడిన పేర్ని నాని, కొడాలి నాని వంటివారు కేసుల భయంతో అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు మాజీ మంత్రి అంబటి చొరవ తీసుకోవడం విశేషమని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో చోటుచేసుకున్న అనేక వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించారు. ఇసుక, మద్యం, బియ్యం, భూ రికార్డుల మార్పులు వంటివాటిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు న్యాయపోరాటం చేస్తున్నారు.
అయితే ఈ కేసుల్లో నాయకులు అంతా తలోదిక్కు పారిపోతే కార్యకర్తలు మాత్రం అరెస్టు అయ్యారు. డబ్బు బలంతో నాయకులు ముందస్తు బెయిల్ తెచ్చుకుని దర్జాగా తిరుగుతున్నారు. దీనిపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులతో పార్టీ అల్లాడిపోయింది. ప్రతి నియోజకవర్గంలోనూ కేసులు, అరెస్టులు జరుగుతున్న స్థానిక నేతలు పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. కానీ, మాజీ మంత్రి అంబటి మాత్రం ఈ విషయంలో అందరికంటే భిన్నంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి బాసటగా నిలుస్తున్నారు.
సోషల్ మీడియా కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారిని రోజులు తరబడి అరెస్టులు చూపించకపోవడం వల్ల కార్యకర్తలు తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. ఈ విషయంలో చొరవతీసుకున్న అంబటి, తమ కార్యకర్తలపై ఆధారాలు ఉంటే అరెస్టు చేయొచ్చని, చట్టప్రకారం అన్నీ జరగాలని చెప్పి దగ్గరుండి న్యాయ సహాయం చేయడంతో చాలా మంది సురక్షితంగా బయటకు వచ్చారని చెబుతున్నారు. అదేసయయంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీపైనే కేసులు నమోదు చేస్తుండగా, టీడీపీ సోషల్ మీడియాపై ఎందుకు కేసులు నమోదు చేయరంటూ పోరాటం ప్రారంభించారు అంబటి. దీంతో పార్టీలో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కార్యకర్తలు కష్టాల్లో ఉంటే మిగిలిన నాయకులు అంతా మౌనంగా ఉంటే తమ కోసం అంబటి గర్జించడంతో కార్యకర్తలకు ఓదార్పు దక్కింది.
వైఎస్ కుటుంబానికి విధేయుడిగా వైసీపీలో తొలి నుంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి.. ఇప్పుడు తనదైన శైలితో కార్యకర్తల అభిమానాన్ని చూరగొంటున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.