సల్మాన్ - షారుఖ్ మధ్యలో బాబా సిద్ధిక్... ఈ స్టోరీ తెలుసా?
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ పై శనివారం సాయంత్రం ఆయన కుమారుడి కార్యాలయం వెలుపల దుండగులు కాల్పులు జరిపారు.
By: Tupaki Desk | 13 Oct 2024 4:41 AM GMTఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ పై శనివారం సాయంత్రం ఆయన కుమారుడి కార్యాలయం వెలుపల దుండగులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఛాతి, పొట్టలో బుల్లెట్లు దిగడంతో ఆయనను వెంటనె లీలావతి ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు!
ఈ సమయంలో అతని హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు యూపీ, మరొకరు హర్యానకు చెందినవారని అంటున్నారు. ఈ హత్యలో పాల్గొన్న మూడో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో సల్మాన్, షారుఖ్ ల మధ్య ఉన్న చిరకాల వైరానికి ముగింపు పలికిన సిద్ధిక్ చాకచక్యాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
అవును... ప్రముఖ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ శనివారం సాయంత్రం ముంబైలో సాయుధ దుండగులతో కాల్చి చంపబడ్డారు. ఇదీ రాజకీయంగానూ, చిత్రపరిశ్రమనూ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్ లో ఇద్దరు స్టార్స్ మధ్య నెలకొన్న సమస్యను ఏ విధంగా పరిష్కరించారనేది తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... 2008లో కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీ జరుగుతుంది. ఈ పార్టీలో షారుఖ్ ఖాన్ – సల్మాన్ ఖాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాడు మొదలైన ఈ విభేదాల ఫలితంగా వీరిద్దరూ సుమారు ఐదు సంవత్సరాల పాటు ఒకరినొకరు చూసుకోను కూడా లేదనే చెప్పాలి! ఆ స్థాయిలో వ్యవహారం ముదిరింది.
ఈ సమయంలో ఈ సమస్యను పరిష్కరించడంలో బాబా సిద్ధిక్ ది కీలక పాత్ర అని అంటారు. ఇందులో భాగంగా... 2013 ఏప్రిల్ 17న సిద్ధిక్ వార్షిక ఇఫ్తార్ పార్టీలో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఈవెంట్ లో ఇద్దరు స్టార్ లు ఎదురుబదురయ్యేలా చూసేందుకు సిద్ధిక్ వ్యూహాత్మకంగా సల్మాన్ తండ్రి సలీం ఖాన్ పక్కన షారుఖ్ ఖాన్ ని కుర్చోబెట్టారు.
ఈ నేపథ్యంలో షారుఖ్, సల్మాన్ లు ఒకరికొకరు ఎదురయ్యారు. దీంతో.. మొహమాటంగా అన్నట్లుగా పలకరించుకున్నారు.. అనంతరం ఆ ఇఫ్తార్ విందులో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ గా మారింది. అనంతరం ఇద్దరి మధ్యా నిల్చుని సిద్ధిక్ ఫోటో దిగి.. సమస్య లేదన్నట్లుగా సంకేతాలు పంపారు.
కాగా... తన రాజకీయ జీవితంలో సిద్ధిక్ వరుసగా మూడు సార్లు బాంద్రా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆహార & పౌరసరఫరాలు, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సుమారు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న తర్వాత.. ఈ ఏడాది ఫిబ్రవరిలో శివసేనతో పొత్తుపై కాంగ్రెస్ తో విభేదాలు రావడంతో అజిత్ పవార్ ఎన్సీపీలో చేరారు.