మౌనమే నా భాష అంటున్న మాజీ మంత్రి
ఆయనే ఉమ్మడి గుంటూరు జిల్లాలకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.
By: Tupaki Desk | 2 Dec 2024 7:30 AM GMTఆయన సీనియర్ ఎమ్మెల్యే. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఆయన సొంతం. ఆయన మంత్రిగా కీలక శాఖలను నిర్వహించిన అనుభవం కలిగి ఉన్నారు. అలాగే బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న వారు. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా కూడా ఆయన రాజకీయ సుడి అయితే తిరగడం లేదు.
దాంతో ఆయన మౌనమే నా భాష అంటున్నారు. ఆయనే ఉమ్మడి గుంటూరు జిల్లాలకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. ఆయన మంత్రిగా ఉంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అంబటి రాంబాబుని 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడించారు. ఇంకేముందు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు.
కానీ జరిగింది వేరు. జిల్లాలో తన కంటే జూనియర్లకు అమాత్య కిరీటాలు దక్కాయి కానీ తనకు మాత్రం ఆ భాగ్యం లేదని కన్నా ఫీల్ అవుతున్నారని అంటున్నారు. ఆయన 1989 లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తరువాత ఎంతో మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. ఒక దశలో ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా కూడా కావాల్సిన వారు. అలా రేసులో ఆయన పేరు కూడా వచ్చింది.
అయితే కన్నాకు 2014 అచ్చి రాలేదు. 2019లో బీజేపీలో ఉంటూ పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసి ఓటమిని చూశారు. ఆ టైం లో ఆయన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేసారు. ఇక 2022లో ఆ పదవి పోయింది. దాంతోనే ఆయన పార్టీ మారాలని చూసారు. మొదట జనసేన అనుకున్నా చివరికి టీడీపీలో చేరారు. సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ ఫ్యామిలీని కాదని మరీ బాబు టికెట్ ఇచ్చారు. దాంతో కేబినెట్ బెర్త్ కూడా అలాగే దక్కుతుందని లెక్క చేసుకున్నారు కానీ అలా అయితే జరగలేదు అంటున్నారు.
దీంతో ఆయన పెద్దగా తన నియోజకవర్గం మీద కూడా ఫోకస్ చేయడం లేదని అంటున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలో సైతం ఆయన పెద్దగా మాట్లాడింది లేదని అంటున్నారు. అనేక కమిటీలలో కూడా ఆయన పేరు అయితే లేదు. నామినేటెడ్ పదవులలోనూ పరిశీలించలేదు అని అంటున్నారు.
దాంతో కన్నా నిరాశ చెందారని అంటున్నారు. రాజకీయంగా చూస్తే కన్నా ఇపుడు కీలకమైన దశలో ఉన్నారు. మరో ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది తెలియదు అని అంటున్నారు. వయోభారం కారణంగా ఆయనకు ఇదే చివరి టెర్మ్ కావచ్చు అని కూడా అంటున్నారు. అయితే ఈ టెర్మ్ లోనే మంత్రి పదవిని అందుకోవాలని ఆయన ఆశపడుతున్నారు అని అంటున్నారు.
మరి విస్తరణలో అయినా ఆయనకు బెర్త్ దక్కుతుందా లేదా అన్నది మరో రెండేళ్ళు ఆగితే కానీ తెలియదు. ఏది ఏమైనా ఆచీ తూచీ అడుగులు వేసినా అన్నీ ఆలోచించి టీడీపీ గూటికి చేరినా ఎమ్మెల్యే అయితే కాగలిగారు కానీ మంత్రి యోగం మాత్రం పట్టలేదని అంటున్నారు.
2014 తరువాత గత పదేళ్ళుగా చూస్తే ఆయనకు రాజకీయంగా ఇబ్బ్బందులే ఎదురయ్యాయని అనుచరులు అంటున్నారు. పదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఎమ్మెల్యే కాగలిగినా మంత్రి సీటు మాత్రం దక్కేలా లేదు. మరి ఈ దఫా కనుక ఆయనకు చాన్స్ రాకపోతే ఇక తన వారసుడికి బాధ్యతలు అప్పగించి తప్పుకుంటారు అన్న ప్రచారమూ సాగుతోంది. మొత్తానికి అయితే కన్నా శిబిరంలో అంతగా ఉత్సాహం అయితే కనిపించడం లేదు అని అంటున్నారు.