నన్ను తొక్కేశారు.. కాంగ్రెస్ రెడ్లపై మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల కలకలం సద్దుమణగక ముందే తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ తీవ్ర ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 25 Feb 2025 10:23 AM GMTఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల కలకలం సద్దుమణగక ముందే తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో రెడ్ల ఆధిపత్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఇటీవల సీనియర్ నాయకుడు వీహెచ్ తో వాగ్వాదానికి దిగిన సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.. తాజాగా కాంగ్రెస్ లోని రెడ్డి వర్గం నాయకులపై మండిపడ్డారు. తనకు యూపీఏ ప్రభుత్వ హయాంలో గతంలో కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అసలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలు తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కకుండా చేయాలని అనుకున్నారని, కానీ, అగ్ర నేత సోనియాగాంధీకి బిహార్ మాజీ సీఎం లూలూప్రసాద్ యాదవ్ సిఫార్సు చేయడంతో ఈ ఎత్తుగడ ఫలించలేదని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయే సమయంలో ఎంపీ టికెట్ ఇచ్చారని.. గెలిచే టైంలో ఇవ్వలేదన్నారు. గత ఏడాది ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ ను మాజీ మంత్రి దానం నాగేందర్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూనే అంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా ఎలా పోటీ చేస్తారనే ప్రశ్నలకు సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సంగతి ఏమిటని ప్రశ్నించారు. వేరే పార్టీలోని దానం నాగేందర్ ను తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ప్రస్తావించారు.
సీఎం రేవంత్ రెడ్డిని రెడ్డి వర్గం నాయకులే వ్యతిరేకించారని.. ఇప్పుడు ఆయన సీఎం అయ్యాక వారే పక్కనచేరారని అంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక పార్టీలో భజన సంఘాలు వచ్చాయని వ్యంగ్యంగా పేర్కొన్నారు. రేవంత్ కష్ట కాలంలో ఉన్నప్పుడు యాదవ సమాజం అండగా నిలిచిందని.. అందుకే సదర్ ను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేశారు. యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుంటే సహించేది లేదని మండిపడ్డారు.
రెడ్లు ఎందరు? వారికి ఎన్ని పదవులు?
తాను కేంద్ర మంత్రి కాకుండా రెడ్డి నేతలు అడ్డుపడ్డారని.. బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలే ఇస్తారా? అని అంజన్ ప్రశ్నించారు. రెడ్లు ఎందరు ఉన్నారు? వారికి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు? అని నిలదీశారు. బీసీలకు ప్రాధాన్యం లేని శాఖలు ఇస్తారని.. రెవెన్యూ, ఫైనాన్స్ వంటి బలమైన శాఖను ఇవ్వరని ఆరోపించారు. రెడ్డి నాయకులు ఎవరినైనా ఎదగనిచ్చారా? తండ్రీకొడుకులు, భార్యభర్తలు 20 ఏళ్లుగా పదవులు అనుభవిస్తూ.. బీసీలను అణగదొక్కుతున్నారని అంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.