Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ కు మాజీ డీఎస్పీ లేఖ.. అందులో ఏమున్నదంటే..?

మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా త్యజించిన తెలంగాణ బిడ్డ నళిని

By:  Tupaki Desk   |   17 Dec 2023 6:38 AM GMT
సీఎం రేవంత్ కు మాజీ డీఎస్పీ లేఖ.. అందులో ఏమున్నదంటే..?
X

మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా త్యజించిన తెలంగాణ బిడ్డ నళిని. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా పోలీసులు ఉద్యమ కారులపై విరుచుకుపడంతో కలత చెందిన ఆమె ఆ సమయంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కొలువు దీరినా నళిని గుర్తించి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో మాజీ డీఎస్పీ నళిని పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆమె గురించి చర్చ..

తెలంగాణ ఉద్యమం సమయంలో రాజీనామా చేసిన నళినిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈసారైనా సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా పలువురు చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఉద్యోగానికి సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యమ సమయంలో ఆమె చూపిన ధైర్యం పలువురికి స్ఫూర్తి నిచ్చిందని అలాంటి వారిని మన ప్రభుత్వంలో కొనసాగించాలని ఆయన అధికారుకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా చేసిన డీఎస్పీ ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

సీఎం ఏమన్నారు..

ఇటీవల పోలీస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నళిని పేరును ఆయన ప్రస్తావించారు. ఆమె తెలంగాణ ఉద్యమం సమయంలో రాజీనామా చేసిందని, ఇప్పడు ఆమె సుముఖంగా ఉంటే ఏదైనా ఉద్యోగం కోసం అవకాశాలను పరిశీలించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

సీఎంకు లేఖ రాసిన నళిని

తన గురించి, తన ఉద్యోగం గురించి చర్చ జరగడంపై మాజీ డీఎస్పీ నళిని స్పందించారు. తాను పోలీస్ శాఖలో ఉద్యోగం మానేసిన తర్వాత ఫిట్ నెస్ లెవల్స్ తగ్గిపోయాయని, ఇప్పుడు ఉద్యోగం ఇచ్చినా గతంలో మాదిరిగా ఫిట్ నెస్ గా పని చేయడం కష్టమన్నారు. పోలీస్ ఉద్యోగానికి సరైన న్యాయం చేయలేనని ఆమె స్పష్టం చేశారు. సీఎం తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రస్తుతం 'వేదయజ్ఞం' పుస్తకాన్ని రాస్తున్నానని, ఉద్యోగానికి బదులు ధర్మ ప్రచారానికి సాయం చేయాలని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలుస్తానని ఆమె లేఖలో పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని అసలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది.