అమ్మ ప్రణీత్ రావు.. ఇంత కథ నడిపారా?
అయితే.. ఇప్పుడు సీన్ మొత్తం మారింది. మొన్నటివరకు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చర్చగా ఉన్న అంశాలు.. ఇప్పుడు ప్రధానమీడియాలో ప్రముఖ వార్తాంశాలుగా మారిపోయాయి.
By: Tupaki Desk | 14 March 2024 7:44 AM GMTరెండు వారాల క్రితం కొన్నివాట్సాప్ గ్రూపుల్లో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు.. అంతా ఫేక్ అంటూ తేల్చేశారు. అయితే.. ఇప్పుడు సీన్ మొత్తం మారింది. మొన్నటివరకు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చర్చగా ఉన్న అంశాలు.. ఇప్పుడు ప్రధానమీడియాలో ప్రముఖ వార్తాంశాలుగా మారిపోయాయి. ఒక డీఎస్పీ స్థాయి అధికారి చేసిన పనులు అతగాడి పరిధి.. అతను నడిపిన యవ్వారాలు ఒక్కొక్కటిగా బయటకు రావటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం అవాక్కు అవుతున్న పరిస్థితి. అప్పట్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే ప్రణీత్ రావు అంతకు మించి చాలానే చేశారన్న విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఎపిసోడ్ల లెక్కన ప్రధాన మీడియా లో బయటకు వస్తున్నాయి. తనకంటూ ప్రత్యేకంగా రెండు గదుల్లో ప్రత్యేక ఏర్పాట్లతో పాటు.. సిబ్బంది సైతం ప్రత్యేకంగా ఉండేవారని చెబుతున్నారు. అంతేకాదు.. గత ప్రభుత్వ పెద్దల దన్ను కోసం వారి మనసుల్ని దోచుకునేందుకు జిల్లాల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. మంగళవారం రాత్రి ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను విచారించే క్రమంలో కొన్ని అంశాలు వెలుగు చూశాయి.
విచారణ వేళ పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని.. బాగానే సతాయించారని తెలుస్తోంది. అయితే.. ఈ అంశం మీద ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్సును సేకరించిన విచారణ అధికారులు అవగాహన పెంచుకుంటున్నారు. మొత్తంగా తాను తప్పు చేసినట్లు.. నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లుగా పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్ చెబుతున్నా.. వివరాలు వెల్లడించే విషయంలో మాత్రం ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల కోసం విపక్ష నేతలు.. వారికి నిధులు ఇచ్చే వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేసే వైనం విస్తుపోయేలా ఉందని చెబుతున్నారు. అతనికి మరో నలుగురు అధికారులు సహకరించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు వార్ రూమ్ లు ఏర్పాటు చేసుకోవటం మామూలే అయినప్పటికీ.. ప్రణీత్ రావు ఎస్ఐబీ కేంద్రంగా పలు జిల్లాల్లో వార్ రూమ్ లు ఏర్పాటు చేశారని సమాచారం.
దీనికి సంబంధించిన కొన్నింటిని పోలీసులు గుర్తించారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నేత ఆదేశాలతో పర్వతగిరిలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. సదరు నేత ఆదేశాలతో పలువురు విపక్ష నేతలతో పాటు కొందరు ప్రభుత్వ అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. విపక్ష నేతలకు నిధులు సమకూర్చే వ్యాపారవేత్తలు.. పారిశ్రామికవేత్తలను గుర్తించటం.. వారిని ఆర్థికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా చేశారని చెబుతున్నారు.
వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్.. సిద్దిపేట.. గజ్వేల్.. కామారెడ్డితో సహా పలు ప్రాంతాల్లో వార్ రూమ్ లు ఏర్పాటు చేశారని.. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. గత ప్రభుత్వ పెద్దల కోసం పనులు చేసిన ప్రణీత్ రావు.. పనిలో పనిగా ఒక ప్రముఖ వజ్రాల వ్యాపారి తన ప్రత్యర్థుల వ్యూహాలు తెలుసుకోవటానికి వారి ఫోన్లను ట్యాప్ చేసేందుకు వీలుగా ప్రణీత్ రావుతో డీల్ కుదుర్చుకున్న విషయాన్ని గుర్తించారు. ఇలా.. అతగాడి లీలలు బయటకు వస్తున్నకొద్దీ షాకింగ్ గా మారాయి. రానున్న రోజుల్లో మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.