Begin typing your search above and press return to search.

'సభకు నమస్కారం' అంటున్న మాజీ సీఎం.. ప్రళయ తాండవమట

మరోవైపు బీఆర్ఎస్ శాసన సభా పక్షం నేతగా కేసీఆర్ ప్రతిపక్ష నేత అయినప్పటికీ అసలు అసెంబ్లీకే వెళ్లలేదు.

By:  Tupaki Desk   |   16 May 2024 6:25 AM GMT
సభకు నమస్కారం అంటున్న మాజీ సీఎం.. ప్రళయ తాండవమట
X

అదేంటో..? వర్తమాన రాజకీయాల్లో ఓ ట్రెండ్ నడుస్తోంది... మిగతా రాష్ట్రాల్లో ఏమో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అన్ని పార్టీలదీ ఇదో ధోరణి అయిపోయింది. అదేమంటే.. ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించండం, లేదా ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీని పట్టించుకోకపోవడం. అటు ఏపీలో అయినా, ఇటు తెలంగాణలో అయినా..

అక్కడా.. ఇక్కడా మాజీ సీఎంలు 2019 ఎన్నికల అనంతరం ఏపీలో మాజీ సీఎంగా మిగిలిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అనేక అవమనాలు ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో ప్రజలను బస్సుల్లో పోలవరం యాత్రకు తీసుకెళ్లడం.. అక్కడ చంద్రబాబును పొగుడుతూ కొందరు మహిళలు పాటలు కట్టడం.. వాటిని జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రదర్శించి నవ్వులపాలుజేయడం అందరూ చూశారు. కాగా, అనంతర కాలంలో కుటుంబ సభ్యులను దూషించారంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. సీఎంగానే తిరిగి అడుగుపెడతానంటూ భీషణ శపథం చేశారు. మరోవైపు అంతకుముందు జగన్ కూడా అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారంటూ బాయ్ కాట్ చేసింది. ఇక తెలంగాణలో నవంబరు చివరిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

పరాజయ భారమా? రేవంత్ ను చూడలేకా?

ఎన్నికల్లో ఓడిన అనంతరం బీఆర్ఎస్ ను కష్టాలు చుట్టుముట్టాయి. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కిందపడి గాయపడ్డారు. ఈ కారణంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ఆలస్యంగా చేశారు. మరోవైపు బీఆర్ఎస్ శాసన సభా పక్షం నేతగా కేసీఆర్ ప్రతిపక్ష నేత అయినప్పటికీ అసలు అసెంబ్లీకే వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని, ఆ సెషన్స్‌ లో ప్రళయ తాండవం చూస్తారని అంటున్నారు.

వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 2014-18 మధ్య కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో చాలా కఠినంగా వ్యవహరించింది. ఆయనను కనీసం నోరెత్తనివ్వలేదు. సభ నుంచి బహిష్కరించింది. కేసీఆర్ సైతం ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అయి కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటమి అనంతరం పరాభవ భారంతోనే కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని.. పరిస్థితులు కాస్త సద్దుమణిగాక వెళ్లాలనేది తన ఉద్దేశమని, తద్వార అధికార పక్షం చేతిలో హేళనకు గురికాకుండా ఉంటామనేది వారి భావనగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కొసమెరుపు: ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గనుక నాలుగైదు ఎంపీ సీట్లయినా సాధించకుంటే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా? అనేది అనుమానమే.