తెలంగాణ బీజేపీకి షాక్.. 5సార్లు ఎమ్మెల్యే.. దళిత మాజీ మంత్రి గుడ్ బై
By: Tupaki Desk | 13 Aug 2023 9:09 AM GMTఆరు నెలల కిందటి వరకు ఒక్కొక్కరిని చేర్చుకుంటూ.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢీకొడుతూ వచ్చిన తెలంగాణ బీజేపీ ఇప్పుడు బేలగా మారిపోయింది. మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిందనే ఆరోపణల నేపథ్యంలో కాషాయ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. ఆ వెంటనే మునుగోడులో ఓటమితో పెద్ద దెబ్బ పడింది. ఇక అక్కడినుంచి ఆ పార్టీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ను తప్పించడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని మోదీ సర్కారుతో లాలూచీ పడినందుకే అధ్యక్షుడిని మార్చారనే వాదన ఇప్పటికీ బలంగా ఉంది.
నాయకులు వెళ్లిపోతున్నారు..
వివాదాస్పద వ్యాఖ్యలు, ఇతర విషయాలు ఎలా ఉన్నా.. సంజయ్ తెలంగాణలో బీజేపీకి ఊపు తెచ్చింది వాస్తవం. అలాంటి నాయకుడి హయాంలో రాష్ట్ర పార్టీలో చేరికలు పెరిగాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో. సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ.. సంజయ్ ని చూసే పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఇలాంటివారంతా ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, వికారాబాద్ నేత ఎ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు.
చలో కాంగ్రెస్..
మునుగోడు ఉప ఎన్నికతో బీజేపీ డీలా పడితే.. పొరుగునున్న కర్ణాటకలో బీజేపీని ఓడించిన కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు వంటివారి చేరికతో దూకుడు మీద ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పెద్దన్నగా ఇండియా కూటమి ఏర్పడడంతో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. కాగా, తెలంగాణలో బీజేపీని వీడుతున్న నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఎ.చంద్రశేఖర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదుసార్లు ఎమ్మెల్యే..
‘‘కష్టపడి పనిచేస్తున్నవారిని పార్టీ గుర్తించడం లేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం అడ్డుకోవడం లేదు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా’’ అంటూ ఎ.చంద్రశేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కాగా, ఎం.చంద్రశేఖర్ రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి మొదలైంది. వికారాబాద్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయనకుంది. వాస్తవానికి ఎ.చంద్రశేఖర్ ను బుజ్జగించేందుకు గత నెలలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ నేత ఈటల ఆయన నివాసానికి వెళ్లారు. కానీ, పార్టీ తనను గుర్తించడం లేదంటూ ఆ సమయంలో చంద్రశేఖర్ అసమ్మతి వ్యక్తం చేసినట్లు సమాచారం.
చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరుసగా నాలుగుసార్లు టీడీపీ టికెట్ మీదనే గెలిచారు. 20-4లో బీఆర్ఎస్ లో చేరారు. వైఎస్ మంత్రివర్గంలో పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ లో చేరిన ఆయన రెండేళ్ల కిందట ఆ పార్టీకి రాజీనామా చేశారు.
శుక్రవారం చేరిక..
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి కార్యాచరణ సిద్ధం చేస్తున్న బీజేపీకి దళిత నాయకుడు, మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా పెద్ద దెబ్బే. ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.