'అమ్మ.. అయ్యకు పుడితే..' టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫైర్!
అమ్మ అయ్యకు పుడితే.. ఇలాంటి ప్రచారాలు ఎవరూ చేయరని అన్నారు.
By: Tupaki Desk | 15 Jan 2024 1:54 PM GMTవైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియాను ఉద్దేశించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పల్నాడు నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు తీవ్రవ్యాఖ్యలు చేశారు. తను వైసీపీలో చేరుతున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వారిని బట్టలు ఊడదీసి కొట్టేందుకు తమ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. అమ్మ అయ్యకు పుడితే.. ఇలాంటి ప్రచారాలు ఎవరూ చేయరని అన్నారు. తాను తన కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నట్టు చెప్పారు.
ఇప్పటికి ఏడోసారి తాను మరోసారి గురజాల నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తనను మానసికంగా.. నియోజకవర్గంలో కలవరపరిచేందుకు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నా రు. ఎన్ని ఆటుపోటులు ఎదురైనా.. తాను టీడీపీలోనే ఉన్నానని.. తనను పార్టీ అదినేత చంద్రబాబు, పార్టీ నాయకుడు నారా లోకేష్ ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు. కానీ, ఇప్పుడు ఉద్దేశ పూర్వకంగా.. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ అధికార పత్రిక తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
సరస్వతి సిమెంట్ వ్యవహారంపై తాను పోరాటం చేశానని.. తనపై ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వెంట్రుక కూడా పీకలేరంటూ.. సీఎం జగన్‌ను ఉద్దేశించి యరపతినేని వ్యాఖ్యానించారు. చివరి శ్వాసవరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఓటమి భయంతో వైసీపీ ఎంతకైనా తెగిస్తోందని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మీడియా, సోషల్ మీడియాలో అసత్య కథనాలు వేస్తున్నారని, తమ కార్యకర్తలు.. తాము పార్టీ మారేది లేదన్నారు.
కాగా, గురజాల నియోజకవర్గంలో 2014, 2009లో వరుస విజయాలు దక్కించుకున్న యరపతినేని గత ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డిపై పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఈయన పార్టీ తరఫున మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే.. వైసీపీ సోషల్ మీడియా కొన్నాళ్లుగా.. ఈయన పార్టీ మారుతున్నారని.. వైసీపీలో చేరుతున్నారని ప్రచారం చేస్తుండడం గమనార్హం.