Begin typing your search above and press return to search.

మోడీకి కాంగ్రెస్‌ మాజీ ప్రధాని నుంచి అనూహ్య మద్దతు!

ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నుంచి అనూహ్య మద్దతు లభించింది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 9:28 AM GMT
మోడీకి కాంగ్రెస్‌ మాజీ ప్రధాని నుంచి అనూహ్య మద్దతు!
X

దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న జీ–20 సదస్సు నిర్వహణ ఏర్పాట్లలో ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఇండోనేసియా రాజధాని జకర్తాలో ఆసియాన్‌ సదస్సులో పాల్గొన్నారు. అలాగే తూర్పు ఆసియా– భారత్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. అక్కడ నుంచి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.

కాగా జీ–20 దేశాల సదస్సులో రష్యా –ఉక్రెయిన్‌ యుద్ధంపైన సభ్య దేశాలు ప్రకటన చేస్తాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నుంచి అనూహ్య మద్దతు లభించింది.

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం విషయంలో భారత్‌ ప్రదర్శించిన స్వతంత్ర వైఖరి సరైందేనని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం మంచి పనిచేసిందని కొనియాడారు. అదే సమయంలో శాంతిస్థాపన ఆవశ్యకతను కూడా మోదీ ప్రభుత్వం ప్రస్తావించిందన్నారు. ఈ మేరకు ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన్మోహన్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే ప్రతిష్టాత్మక జీ–20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమిస్తుండటంపైన మన్మోహన్‌ సింగ్‌ సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో భారత్‌ ను జీ20 అధ్యక్ష బాధ్యతల్లో చూడటం ఆనందంగా ఉందన్నారు. జీ20 నేతలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడాన్ని తాను చూస్తున్నానన్నారు.

భారత పాలనా నిర్మాణంలో విదేశాంగ విధానం కీలకమని మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఇది ప్రస్తుతం పార్టీల స్వప్రయోజనాలకు ముఖ్యమైన అంశంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తన హయాంలో పార్టీ రాజకీయాల కంటే విదేశాంగ విధానానికే అధిక ప్రాధాన్యం ఉండేదని మన్మోహన్‌ గుర్తు చేసుకున్నారు. దౌత్యాన్ని పార్టీ రాజకీయాలకు ఉపయోగించే విషయంలో సంయమనం పాటించడం ముఖ్యమని అన్ని పార్టీలకు ఆయన సూచించారు.

అలాగే రష్యా–ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఘర్షణలపై మన్మోహన్‌ స్పందించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఘర్షణ నెలకొన్నప్పుడు ఏదో ఒక దానికి మద్దతుగా నిలవడం ఇతర దేశాలకు కష్టమైన విషయమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ భారత్‌ తీసుకున్న వైఖరి సరైందనేనని తాను భావిస్తున్నానన్నారు. అలాగే సైనిక ఘర్షణను పరిష్కరించే వేదికగా జీ20ని ఎన్నడూ పరిగణించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో జీ–20 సదస్సులో భద్రతాపరమైన విభేదాలను పక్కనపెట్టి వాతావరణ మార్పులు, అసమానతలు, అంతర్జాతీయ వాణిజ్యంలో విశ్వాసాన్ని నెలకొల్పే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

అలాగే భారత సరిహద్దుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వానికి తాను ఎలాంటి సలహా ఇవ్వబోనని తెలిపారు.

చంద్రయాన్‌ పేరిట 2008లో మొదలైన ప్రయోగాలు ప్రస్తుతం సరికొత్త శిఖరాలకు చేరుకోవడం పట్ల మన్మోహన్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి తరఫున 2004 నుంచి 2014 వరకు మన్మోహన్‌ సింగ్‌ భారత ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ పనిచేసిన సంగతి తెలిసిందే. గతంలో పీవీ నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్‌ దేశాన్ని ఆర్థిక సంస్కరణలవైపు నడిపించారు.