సనాతన ధర్మం... కుష్టు, హెచ్‌ఐవీ లాంటిది: డీఎంకే నేత తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు!
సనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు
By: Tupaki Desk | 7 Sep 2023 9:26 AM GMTసనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే ప్రభుత్వంలో మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో డీఎంకేకు చెందిన నీలగిరి ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి తక్కువ వ్యాఖ్యలు చేశారన్నారు. వాస్తవానికి సనాతన ధర్మం.. కుష్టు, హెచ్‌ఐవీ లాంటిదన్నారు. హెచ్‌ఐవీ కంటే ప్రాణాంతకమైనదిగా అభివర్ణించారు.
అంతేకాకుండా సనాతన ధర్మంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, శంకరాచార్యులు ఇలా ఎవరైనా సరే తనతో చర్చకు రావాలని ఎ.రాజా సవాల్ విసిరారు. సనాతన ధర్మంపై ఉదయనిధి ఏం మాట్లాడినా చాలా తక్కువేనని అన్నారు. ఆయన మలేరియా, డెంగ్యూలతో మాత్రమే పోల్చాడన్నారు. కానీ సనాతన ధర్మం అనేది భయంకరమైందని రాజా వ్యాఖ్యానించారు. హెచ్‌ఐవి కంటే ప్రమాదకరమైందన్నారు.
ఎ.రాజా ప్రకటనపై బీజేపీ స్పందించింది. ఉదయనిధి తర్వాత ఆయన సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న దేశంలోని 80 శాతం మందిని అవమానించడమేనని మండిపడ్డారు. హిందువులను కించపరచడం ద్వారా ఎన్నికలలో విజయం సాధించవచ్చని భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అసలు లక్ష్యం ఇదని చురకలంటించారు.
కాగా తన కుమారుడు, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల దుమారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ఉదయనిధి ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామెంట్ చేయడం సరికాదని అన్నారు.
బీజేపీ వక్రీకరించినట్లు ’జాతి నిర్మూలన’కు తన కొడుకు పిలుపునివ్వలేదని కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు. ఉదయనిధి వాస్తవంగా ఏం మాట్లాడారో తెలుసుకోకుండా బీజేపీ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు నకిలీ వార్తలను ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తెలిపారు.
అణచివేతకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ అనుకూల శక్తులు తన కుమారుడు ఉదయనిధి వైఖరిని సహించలేకపోతున్నాయని స్టాలిన్ మండిపడ్డారు. అందుకే సనాతన ఆలోచనలు గల వ్యక్తులను నరమేధం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చాడంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పెంచి పోషిస్తున్న ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు.
ఉదయనిధి తల తెస్తే రూ.10 కోట్లు ఇస్తానన్న ఉత్తరప్రదేశ్ స్వామీజీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసు ఎందుకు పెట్టలేదని స్టాలిన్ నిలదీశారు. సనాతన వివక్షత పట్ల బీజేకిపీ అసలు పట్టింపు లేదన్నారు. ఒకవేళ డీఎంకే పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని బీజేపీ ప్రయత్నిస్తే.. వారే ఆ ఊబిలో మునిగిపోతారని శాపనార్థాలు పెట్టారు.
కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని ఎంకే స్టాలిన్ గుర్తు చేశారు. మహిళలు కొన్ని పనులు చేయకూడదంటున్నారని ఆరోపించారు. వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని కూడా వాదిస్తున్నారన్నారు. మానవ జాతిలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు ’సనాతన’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. అలాంటి అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడాడని స్పష్టత నిచ్చారు.