కేటీఆర్ చుట్టూ ఈ-కార్ ఉచ్చు.. అరెస్టుకు రంగం సిద్ధమైందా..?
ఫార్ములా ఈ- కార్ రేసింగ్‌లో మాజీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 5 Nov 2024 5:37 AM GMTబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా..? అందుకే హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారా..? అరెస్టుకు సంబంధించి ప్రాసెస్ అంతా పూర్తయిందా..? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన బాంబులు పేలబోతున్నాయా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
ఫార్ములా ఈ- కార్ రేసింగ్‌లో మాజీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సియోల్ పర్యటన సందర్భంగా రాజకీయ బాంబులు పేలబోతున్నాయి అంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. దాంతో తాజాగా ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఏసీబీ నోటీసులు జారీ చేయడం.. కేటీఆర్ బావమరిది జన్వాడ ఫాంహౌస్‌లో దాడులు నిర్వహించడం.. వాటికి సంకేతాలుగా కనిపించాయి. మరోవైపు.. ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కేటీఆర్‌ను టార్గెట్ చేసి చేసినవేనని ప్రచారం జరుగుతోంది.
ఫార్ములా ఈ-కార్ రేసులో జరిగిన గోల్‌మాల్‌పై సంబంధించి విచారణ చేపట్టాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఇటీవల ఏసీబీకి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది. ఏసీబీ జేడీ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఈ అంశంపై విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలు కీలకంగా మారాయి.
అయితే.. గతంలోనే ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఎన్నికల సందర్భంలోనూ రేవంత్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సమయంలో ఐఏఎస్ అర్వింద్ కుమార్ కొంత వివరణ ఇచ్చారు. గత మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాల మేరకే తాను నడుచుకున్నానని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకే రూ.55 కోట్లు ఆర్థిక శాఖ అనుమతి లేకున్నా విడుదల చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే.. తాజాగా నోటీసుల జారీ నేపథ్యంలో మరోసారి ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కేటీఆర్ ఓ విదేశీ సంస్థకు అంత డబ్బు బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధికారి అర్వింద్ ఈడీకి కూడా చెప్పి్నట్లు తెలిసింది. దాంతో ఇక కేటీఆర్ అరెస్ట్ ఖాయం అయినట్లేనన్న చర్చ నడుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన అరెస్ట్ ఉండొచ్చన్న ప్రచారం వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే హైదరాబాద్ నగరం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. బీఆర్ఎస్ ముఖ్యనేత అరెస్టు నేపథ్యంలోనే 144 సెక్షన్ అమలు చేస్తున్నారా అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.