Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు కష్టకాలం మొదలైందా? గవర్నర్ కీలక అనుమతి?

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం లభించినట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 4:41 AM GMT
కేటీఆర్ కు కష్టకాలం మొదలైందా? గవర్నర్ కీలక అనుమతి?
X

మాజీ మంత్రి కేటీఆర్ కు కష్ట కాలం మొదలుకానుందా? రోజు గ్యాప్ ఇవ్వకుండా రేవంత్ సర్కారు కొలువు తీరిన రోజు నుంచి అదే పనిగా విమర్శలు.. ఆరోపణలు సంధించే ఆయనపై ఇప్పుడు కేసు నమోదు కానుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో కీలక శాఖను చేపట్టిన కేటీఆర్.. ఆ సందర్భంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం ఇప్పుడు ఆయన మెడకు గుదిబండలా మారుతుందా? అంటే అవుననే చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం లభించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫైలు రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ వేదికగా ఫీఫార్ములా కార్ రేసు జరగటం.. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని.. నిర్వాహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో.. ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఈ అంశంపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివ్రద్ధి సంసథ అక్టోబరులో ఏసీబీకి కంప్లైంట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో ఏ మాత్రం సంబంధం లేని హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవటం.. రిజర్వు బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండా రెండు దఫాలుగా రూ.46 కోట్లను విదేశీ కరెన్సీలో చెల్లించటం.. దీనికి హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకపోవటం లాంటి అంశాల్ని ఇందులో పేర్కొన్నారు.

ఈ ఉదంతంలో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్.. అప్పటి చీఫ్ ఇంజినీర్.. గత ప్రభుత్వంలో సదరు శాఖకు మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ లపై ఎఫ్ఐఆర్ లను నమోదు చేయటానికి తమకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో విన్నవించింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధి అయిన మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను గత నెలలో ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై న్యాయసలహా తీసుకున్న గవర్నర్ కేసు నమోదుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామం రాజకీయంగా సంచలనంగా మారే వీలుందని చెబుతున్నారు. ఈ అంశంపై కేటీఆర్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.