Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్... సీనియర్ ఐఏఎస్ కు షోకాజ్!

వాస్తవానికి హైదరాబాద్‌ లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్‌ రద్దయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jan 2024 11:30 AM GMT
హైదరాబాద్  లో ఫార్ములా ఈ రేస్... సీనియర్  ఐఏఎస్  కు షోకాజ్!
X

ఒకపక్క ప్రభుత్వ అనుమతులు లేకుండా, మరోపక్క ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారనే వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. క్యాబినెట్ అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం వంటివి లేకుండా ఏకపక్షంగా రూ.54కోట్ల విడుదల చేశారనే అభియోగాలపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమంలో ప్రైవేట్ సంస్థకు క్యాబినెట్ అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ఏకపక్షంగా నిధుల విడుదలకు ఆదేశించిన అంశంపై వివరణ ఇవ్వాలని సర్కార్ ఆదేశించడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అరవింద్‌ కుమార్‌ హైదరబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్.ఎం.డి.ఏ) కమిషనర్‌ గా వ్యవహరించిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల చేశారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

2023 అక్టోబర్‌ 30వ తేదీన.. అంటే... రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండానే ఈ రేసింగ్‌ ప్రాజెక్టుకు నిధుల్ని విడుదల చేయడం.. కొత్త ప్రాజెక్టులకు నిధుల విడుదల చేయడంపై ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉన్నా క్యాబినెట్‌ అమోదం లేకుండానే హైదరాబాద్‌ లో పార్ములా-ఈ రేస్ పోటీలను నిర్వహించేందుకు హెచ్.ఎం.డీ.ఏ ఒప్పందం కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారిన వ్యవహారానికి ఇప్పుడు రియాక్షన్ వచ్చినట్లయ్యిందని అంటున్నారు!

వాస్తవానికి హైదరాబాద్‌ లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్‌ రద్దయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేసింగ్ సంస్థ ప్రకటించింది. ఈ వ్యవహారంపై వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని నిందిస్తూ ట్వీట్ కూడా చేశారు. అయితే... ముందస్తు నోటీసులేవీ ఇవ్వకుండానే ఒప్పందాన్ని అతిక్రమించారని, అందువల్ల లీగల్‌ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్స్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కాగా... గత ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో జరిగిన సీజన్-9 పార్ములా-ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌ కో రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30కోట్లు ఖర్చుచేశాయి. ఇక రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్.ఎం.డి.ఏ. రూ.20 కోట్లు ఖర్చు చేసింది.

అయితే ఈ ఏడాది తలపెట్టిన ఫార్ములా-ఈ 10వ సీజన్ ఈవెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌ గా మాత్రమే ఉండాల్సి ఉంది. అంటే... ఖర్చు మొత్తం ప్రైవేటు సంస్థలైన గ్రీన్‌ కో ఫార్ములా ఈ సంస్థ భరించాల్సి ఉంది. అయినప్పటికీ ఈసీ అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోకుండానే సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ఈవెంట్ నిర్వహణకు హెచ్.ఎం.డీ.ఏ నుంచి రూ.54కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు.

దీంతో దీని వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నట్లున్న రాష్ట్ర ప్రభుత్వం... నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారనే వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి నోటీసులు జారీ చేసింది. అనుమతులు లేకుండా ఏకపక్షంగా రూ.54కోట్ల విడుదల చేశారనే అభియోగాలపై వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.