Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ ఫార్ములా రేస్‌ రద్దుకు అసలు కారణం ఇదేనా?

ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌ లో జరగాల్సిన ఫార్ములా ఈ–రేస్‌ రద్దు అయ్యింది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 6:17 AM
హైదరాబాద్‌ ఫార్ములా రేస్‌ రద్దుకు అసలు కారణం ఇదేనా?
X

ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌ లో జరగాల్సిన ఫార్ములా ఈ–రేస్‌ రద్దు అయ్యింది. ఈ మేరకు ఫార్ములా ఈ– రేసును రద్దు చేసినట్లు ఎఫ్‌ఐఏ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతోనే రేసును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ.. ఆతిథ్య నగరం (హోస్ట్‌ సిటీ) ఒప్పందాన్ని నెరవేర్చకూడదని నిర్ణయం తీసుకుందని.. ఈ నేపథ్యంలో రేసును నిర్వహించబోమని నిర్వాహక సంస్థ.. ఎఫ్‌ఐఏ ప్రకటించింది.

కాగా దేశంలోనే తొలిసారిగా గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ వేదికగా ఫార్ములా ఈ– రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలాం హుస్సేన్‌ సాగర్‌ తీరం వెంబడి ఈ రేసును నిర్వహించారు. మన దేశంలో తొలిసారిగా జరిగిన ఈ ఇంటర్నేషనల్‌ ఫార్ములా ఛాంపియన్‌షిప్‌ను చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్‌ నగరానికి భారీ ఎత్తున తరలివచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌ ఫార్ములా ఈ– రేసింగ్‌ కు ఆతిథ్యం ఇవ్వనుందని రేసింగ్‌ ప్రియులు ఆశించారు. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఫార్ములా ఈ–రేసింగును రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

రేసింగ్‌ నిర్వహణకు నిర్వాహకులు గతేడాది అక్టోబర్‌ 30న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా అధికారిక సమాచారం ప్రకారం.. రేసింగు నిర్వాహకులు ఈ నెల ప్రారంభంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. అప్పటి నుంచి ఇంకా చర్చలు కొనసాగుతూనే వున్నాయి. ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఈ భారీ ఈవెంట్‌ కు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో రేసు రద్దు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది రేసును టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్‌ లతో సహా ఇతర ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తారని సమాచారం.

హైదరాబాద్‌ లో ఫార్ములా ఈ రేస్‌ రద్దు పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమే అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ ఈ–ప్రిక్స్‌ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ నగరం బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతాయన్నారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసింగ్‌ పై తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదన్నారు.