ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం... ఈ మరణశిక్ష "అంతకు మించి"!
అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మరణశిక్ష.. "అంతకు మించి" అన్నట్లుగా ఉంటుంది.
By: Tupaki Desk | 25 Jan 2024 11:30 PM GMTతీవ్రమైన నేరాలు చేసినవారికి కోర్టులు మరణశిక్షలు విధిస్తుంటాయి. అయితే కొన్ని దేశాల్లో ఉరి వేసి అమలుచేస్తే.. మరికొన్ని దేశాల్లో తుపాకీలతో కాల్చి చంప్తుంటారని.. ఇంకొన్ని దేశాల్లో పబ్లిక్ గా నరికి, రాళ్లతో కొట్టి చంపుతారని అంటుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మరణశిక్ష.. "అంతకు మించి" అన్నట్లుగా ఉంటుంది. తాజాగా అమెరికాలో ఈ మరణశిక్ష హాట్ టాపిక్ గా మారింది. ఈ శిక్ష విధిస్తే... మనిషి గిల గిలా కొట్టుకుంటూ మరణిస్తాడని చెబుతున్నారు.
అవును... యునైటెడ్ స్టేట్స్ లోని అలబామాలో సరికొత్త మరణశిక్ష తెరపైకి వచ్చింది. ఊహకందని రీతిలో అమలు కాబోయే ఈ మరణశిక్ష తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం చేసిన నిందితుడికి... బుధవారం యూఎస్ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దీంతో.. ఈ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఈ తరహాలో శిక్షించి చంపడం ఇదే తొలిసారి కానుంది. అదెలానంటే... నైట్రోజన్ గ్యాస్ ను ఉపయోగించి మరణశిక్ష అమలు చేయబోతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... కోల్ బర్ట్ కౌంటీలో చార్లెస్ సెన్నెట్ అనే మతాధిపతి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే... ఆ విషయం అతని భార్యకు తెలిసింది. దీంతో ఆమె అతడిని నిలదీసింది. దీంతో చార్లెస్ తనను నిలదీయడాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో... తన భార్య ఎలిజబెత్ సెన్నెట్ ను చంపించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా... ఆమెను చంపడానికి బిల్లీ గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు.
దీంతో రంగంలోకి దిగిన బిల్లీ గ్రే విలియమ్స్.. కెన్నెత్ స్మిత్, జాన్ పార్కర్ అనే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు 1000 డాలర్ల చొప్పున సబ్ కాంట్రాక్ట్ తరహాలో ఆ పని అప్పగించాడు. ఈ నేపథ్యంలో... 1988 మార్చి 18వ తేదీన ఆమెను ఇంట్లోనే దారుణంగా హతమార్చారు ఆ ఇద్దరు కిరాయి హంతకులు. దీంతో దర్యాప్తులో తన బండారం బయట పడుతుందేమోనని భయపడిన ఛార్లెస్... తన కుటుంబ సభ్యుల ముందు నిజం ఒప్పుకుని, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితుల్లో బిల్లీ గ్రేకు యావజ్జీవ శిక్ష పడగా.. స్మిత్, పార్కర్ ఇద్దరికీ మరణశిక్ష విధించింది కోర్టు. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో 2020లో జైల్లోనే మరణించాడు బిల్లీ. ఈ క్రమంలో 2010 జూన్ లో పార్కర్ కు లెథల్ అనే ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలుచేశారు. అయితే స్మిత్ కు మరణశిక్ష అమలుచేసే విషయంలో మాత్రం జాప్యం అవుతూ వచ్చింది.
ఈ క్రమంలో 2023 నవంబర్ 17న స్మిత్ కు కూడా లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించినా... ఇంజిక్షన్ ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో శిక్ష నిలిపేశారు. ఈలోపు అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసిపోయింది. దీంతో.. అతని మరణశిక్ష అమలుపై సమీక్ష జరపాలని అలబామా గవర్నర్ ఆదేశించారు.
ఈ సమయంలో... నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించగా.. అసలు వ్యవహారం మొదలైంది. ఇందులో భాగంగా... ఈ తరహా శిక్షను నిలిపివేయాలంటూ అలబామాను కోరుతుంది ఐక్యరాజ్య సమితి మాన హక్కుల సంఘ కార్యాలయం! మరోపక్క ఎలిజబెత్ కుటుంబ సభ్యులు మాత్రం శిక్ష అమలు చేయాల్సిందేనని కోరుతున్నారు. ఈ క్రమంలో... సుప్రీంకోర్టు ఈ శిక్ష అమలుకు అనుమతిచ్చింది.
ఈ శిక్షను ఎలా అమలుచేస్తారు?:
తాజాగా యూఎస్ సుప్రీం అనుమతిలో అమలుచేస్తున్న ఈ నైట్రోజన్ హైపోక్సియా అంటే... నైట్రోజన్ వాయువుతో నింపబడిన సిలిండర్ కు బిగించిన పైప్ ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. అంటే... ఐసీయూలో ఒక వ్యక్తి ప్రాణాలు కాపడటానికి ఆక్సిజన్ సిలెండర్ ఎలా పెడతారో అలా అన్నమాట. కాకపోతే ఇక్కడ లోపలికి పంపే గ్యాస్ వేరు.. పర్పస్ వేరు.. రిజల్ట్ వేరు!!
అలా ముక్కుకి నైట్రోజన్ సిలెండర్ కు అమర్చిన మాస్క్ బిగించిన అనంతరం... గ్యాస్ ను విడుదల చేస్తారు. దీంతో... ఆక్సిజన్ అందక, అందుతున్న నైట్రోజన్ మోతాదుతో ఆ వ్యక్తి గిలగిల కొట్టుకుంటూ మరణిస్తాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి గిల గిల కొట్టుకుంటూ నరకం అనుభవిస్తాడని ఒకరంటే.. ఇది వీలైనంత స్మూత్ డెత్ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు!!