Begin typing your search above and press return to search.

టీడీపీ కంచుకోటలో నలభై వేల ఓట్లు గల్లంతు...?

తెలుగుదేశం పార్టీకి ఆ సీటు కంచుకోట లాంటిది. 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గం ఏర్పడింది. ఆనాటి నుంచి ఇప్పటికి మూడు సార్లు టీడీపీయే గెలుస్తూ వచ్చింది. పైగా ఒక్కరే ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఆయనే వెలగపూడి రామక్రిష్ణబాబు.

By:  Tupaki Desk   |   22 July 2023 4:43 PM GMT
టీడీపీ కంచుకోటలో నలభై వేల ఓట్లు గల్లంతు...?
X

తెలుగుదేశం పార్టీకి ఆ సీటు కంచుకోట లాంటిది. 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గం ఏర్పడింది. ఆనాటి నుంచి ఇప్పటికి మూడు సార్లు టీడీపీయే గెలుస్తూ వచ్చింది. పైగా ఒక్కరే ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఆయనే వెలగపూడి రామక్రిష్ణబాబు. ఆయన విజయవాడ నుంచి విశాఖకు వచ్చి వ్యాపారం చేసుకుంటూనే తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు.

ఆయనకు 2009లో నందమూరి వారసుడు, సినీ నటుడు బాలక్రిష్ణ సిఫార్సు మేరకు టికెట్ దక్కింది. ఆ తరువాత ఆయన అదే సీటు నుంచి చంద్రబాబు ప్రోత్సాహంతో గెలుస్తూ వస్తున్నారు. 2014లో ఆయనకు ఏపీలో రెండవ అతి పెద్ద మెజారిటీ దాదాపుగా 47 వేల పై చిలుకు దక్కింది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి నపుడు విశాఖ తూర్పులో గాలి బలంగా వీచినా వెలగపూడి గెలిచారు. 2019లో జగన్ వేవ్ లోనూ తన సీటును నిలబెట్టుకున్నారు.

ఇక వెలగపూడిని ఓడించాలని వైసీపీ గట్టిగా డిసైడ్ అయింది. ఆయన్ని టార్గెట్ చేసింది. ఇదిలా ఉంటే తన నియోజకవర్గంలో మొత్తం 40 వేల ఓట్లు గల్లంతు అయ్యాయని తీవ్రమైన ఆరోపణనే వెలగపూడి చేశారు. 2019 లో ఉన్న ఓట్లు ఇపుడు గల్లంతు కావడం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కావాలనే అధికార వైసీపీ చేస్తోంది అని అంటున్నారు.

తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారని అది నిబంధనలకు విరుద్ధమని వెలగపూడి అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లను తీసేయడమేంటి ఒకే కుటుంబంలో ఉన్న వారిని వేరు వేరు బూతులలోకి బదిలీ చేయడమేంటి అని ఆయన ప్రశ్నించారు. ఓట్లు కోల్పోయిన వారంతా అధికారులకు విన్నపం చేసుకున్నా ఫలితం లేకపోయిందని ఆయన అంటున్నారు. ఇక ఈసీనే తాము ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా వెలగపూడి చెప్పినట్లుగా నలభై వేల ఓట్లు తీసెయడం సాధ్యమా అన్నది ఒక ప్రశ్న అయితే అధికారుల నుంచి వస్తున్న జవాబు ఏంటి అంటే వారంతా వలసలు వెళ్లారని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ తూర్పులో ఈసారి వైసీపీ గెలవాలని చూస్తోంది. అదే టైం లో నాలుగవ సారి గెలిచి సెకండ్ హ్యాట్రిక్ కి బాటలు వేసుకోవాలని వెలగపూడి చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపె కంచుకోట నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా యుద్ధం సాగుతోంది. తప్పుడు ఓటర్లనే అధికారులు తొలగిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దొంగ ఓట్లు ఉంటే కచ్చితంగా పోతాయని చెబుతున్నారు. అలా అనుకున్నా అన్ని వేల దొంగ ఓట్లు ఉంటాయా అలా ఉంటే ఇన్నాళ్ళూ ఎందుకు ఊరుకున్నారు అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది ఏది ఏమైనా గెలుపు కోసం ఓట్లు కావాలి అవి మంచి ఓట్లుగా ఒకరికి అనిపిస్తే దొంగ ఓట్లుగా కొందరికి కనిపిస్తున్నాయి. తేల్చాల్సిన అధికారులు అయితే చోద్యం చూస్తున్నారు.