Begin typing your search above and press return to search.

విన్నంతనే నవ్వు వచ్చే ఈ ఉదంతం నిజంగానే అమెరికాలో చోటు చేసుకుంది

విన్నంతనే నవ్వు వచ్చే ఈ ఉదంతం నిజంగానే అమెరికాలో చోటు చేసుకుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే..

By:  Tupaki Desk   |   12 March 2025 1:51 PM IST
విన్నంతనే నవ్వు వచ్చే ఈ ఉదంతం నిజంగానే అమెరికాలో చోటు చేసుకుంది
X

విన్నంతనే నవ్వు వచ్చే ఈ ఉదంతం నిజంగానే అమెరికాలో చోటు చేసుకుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిన కొడుకు వయసు నాలుగేళ్లు మాత్రమే. అగ్రరాజ్యంలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మౌంట్ ప్లీసాంట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని పోలీసులే స్వయంగా వెల్లడించారు. పిల్లాడు ఇష్టంగా తింటున్న ఐస్ క్రీంను తల్లి గభాల్న తీసుకొని తినేసింది. దీంతో పట్టరాని కోపానికి గురైన నాలుగేళ్ల పిల్లాడు పోలీసులకు ఫోన్ చేశాడు. మనకు ఎలా అయితే 100 ఉంటుందో.. అమెరికా మొత్తం 911 నెంబరుకు ఫోన్ చేస్తే.. పోలీసులు వెంటనే అందుబాటులోకి వచ్చేస్తారు.

తన కొడుకు 911 కు ఫోన్ చేసి తన మీద కంప్లైంట్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన ఆ తల్లి.. ఫోన్ అందుకొని అసలు విషయం చెప్పి.. తన కొడుకు వయసు నాలుగేళ్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆ పిల్లాడు అమ్మ చెడ్డదైందని.. వెంటనే వచ్చి అరెస్టు చేయాలని కోరాడు. తన ఐస్ క్రీం తీసుకున్న తన తల్లి పెద్ద తప్పు చేసినట్లుగా ఆ పిల్లాడు అరవటం పోలీసుల కాల్ లోరికార్డు అయ్యింది. పిల్లాడి మాటలకు పోలీసులు సైతం నవ్వుకున్నారు.

అయితే.. నిబంధనల్ని అనుసరించి ఇద్దరు మహిళా పోలీసులు సదరు పిల్లాడి ఇంటికి వెళ్లారు. ఈసారి పోలీసులకే నేరుగా ఆ పిల్లాడు తల్లి మీద కంప్లైంట్ చేశాడు. అమ్మను అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లండంటూ ఉక్రోషంతో చెప్పాడు. మరి.. మీ అమ్మను నిజంగానే జైల్లో వేసేస్తాం.. నీకు సంతోషమేనా? అని పోలీసులు అడగ్గా.. అలా వద్దు.. నాకు కొత్త ఐస్ క్రీం ఇప్పిస్తే సరిపోతుందని బదులిచ్చాడు. దీంతో.. పిల్లాడి ఐస్ క్రీం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.

ఇది జరిగిన రెండు రోజుల తర్వాత మరోసారి పోలీసులు వారి ఇంటికి వెళ్లటంతో పిల్లాడి తల్లి కంగారు పడింది. అయితే.. పోలీసులు ఆమె సందేహాన్ని అర్థం చేసుుకొని.. చిరునవ్వుతో పిల్లాడు ఎక్కడని అడిగారు. అందుకు సమాధానంగా పిల్లాడ్ని పిలవగా.. అతడి చేతికి పెద్ద ఐస్ క్రీం టబ్ ఇచ్చారు. దీంతో ఆ పిల్లాడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. జరిగిన ఈ ఆసక్తికర విషయాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించటంతో ఈ వ్యవహారం ప్రపంచానికి తెలిసింది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఒకలాంటి షాక్ తో నవ్వుకుంటున్న పరిస్థితి.