మరో 4 బీఆర్ఎస్ ఎంపీలూ జంప్? ముఖ్య నేత జిల్లా నుంచి?
సరిగ్గా చెప్పాలంటే లోక్ సభ ఎన్నికలు మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. 2019లో ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరిగింది.
By: Tupaki Desk | 7 Feb 2024 11:53 AM GMTసరిగ్గా చెప్పాలంటే లోక్ సభ ఎన్నికలు మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. 2019లో ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈసారి కాస్త ముందుగానే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే.. మూడు నెలల్లోపే ఎన్నికలు జరగొచ్చు. దీంతోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లికి చెందిన ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు.
ఇంకెందురు?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సరిగ్గా రెండు నెలలు. అయితే, ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పటికి ప్రతిపక్షాన్ని వీడి అధికార పక్షంలోకి చేరలేదు. అయితే, మంగళవారం అనూహ్యంగా వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ఎమ్మెల్యే చేరడం అంటే.. ఒక నియోజకవర్గ పరిధే. అదే ఎంపీ అంటే 6-7 నియోజకవర్గాల పరిధి. కాగా, వెంకటేశ్ నేత తరహాలో మరికొందరు బీఆర్ఎస్ ఎంపీలూ కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
9 మందిలో ఒకరు ఔట్? మిగతా నలుగురు?
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 ఎంపీ సీట్లు నెగ్గింది. కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు, ఎంఐఎం ఒకటి గెలిచాయి. బీఆర్ఎస్ 9 మంది ఎంపీల్లో వెంకటేశ్ నేత వెళ్లిపోగా.. 8 మంది మిగిలారు. అయితే ,ఇంకో నలుగురూ ఇదే బాటన ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్య నేత సొంత జిల్లాకు చెందిన ఎంపీ జంప్ జిలానీల జాబితాలో ముందున్నట్లుగా తెలుస్తోంది. ఆయన అత్యంత సమీప బంధువు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడమే దీనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఇక మిగతా ముగ్గురు ఎవరనే ప్రశ్న వస్తోంది.
ఆయన ఉంటారా? వెళ్తారా?
తెలంగాణలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కొరుకుడు పడని జిల్లాకు చెందిన ఎంపీ కూడా ఆ పార్టీని వీడే చాన్సుందని చెబుతున్నారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ.. జిల్లాలో బీఆర్ఎస్ కు అసలు నాయకత్వమే లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పదని భావిస్తున్నట్లు సమాచారం. అందులోనూ ఆ జిల్లానుంచి ముగ్గురు నాయకులు పెద్ద పదవుల్లో ఉండడంతో ఎంపీకి రాజకీయంగా ఊపిరాడడం లేదు. గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరు హైదరాబాద్ పరిసర ప్రాంత ఎంపీ అని కథనాలు వస్తున్నాయి. మరి వీటిలో ఏ ఊహాగానం నిజం అవుతుందో?