నాలుగు కోట్లు... రెండున్నర కోట్లు...కోటిన్నర...ఇదీ వైసీపీ లెక్క...!?
దానికి కారణం ఏపీ పొలిటికల్ పల్స్ ని పూర్తిగా పట్టుకోవడం అని అంటున్నారు.
By: Tupaki Desk | 18 Jan 2024 3:15 AM GMTవైసీపీలో గెలుపు ధీమా ఉంది. ఏపీలో మరే రాజకీయ పార్టీలో కనిపించనంత ఆత్మ విశ్వాసం వైసీపీలో ఉంది. అదే ఇపుడు విపక్షాలను కూడా ఆలోచనలో పడేస్తోంది. జగన్ రిలాక్స్ గా ఉంటున్నారు. ఎటువంటి టెన్షన్లు ఆయనకు లేవు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ అధినేతలు తెగ వత్తిడికి గురి అవుతారు.
ఎన్నికలు తరుముకుని వస్తున్న వేళ వారు నిరంతరం టెన్షన్ లోనే కనిపిస్తారు. కానీ జగన్ లో మాత్రం మచ్చుకైనా అలాంటి పరిస్థితి లేదు అని అంటున్నారు. దానికి కారణం ఏపీ పొలిటికల్ పల్స్ ని పూర్తిగా పట్టుకోవడం అని అంటున్నారు. అదే విధంగా తాను జనాలకు ఏమి చేశాను తనకు జనాలు ఏమి చేయాలి, ఏపీలో జనాల మూడ్ ఎలా ఉంది విపక్షాల వీక్ నెస్ ఏంటి తన బలం ఏంటి ఇవన్నీ కచ్చితమైన అంచనాలతో జగన్ ఉన్నారని అంటున్నారు.
ఇక విషయానికి వస్తే జగన్ కి పక్కా వ్యతిరేక మీడియా కానీ నేతలు కానీ స్వయంగా చేయించుకున్న ఏ సర్వేలలో కూడా వైసీపీ ఓటు షేర్ ఎట్టి పరిస్థితుల్లోనూ 45 శాతానికి తగ్గడంలేదు. ఇది కదా వైసీపీలో ధీమాను పెంచే అసలు విషయం అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ లెక్క ఎలా ఉంది అంటే మొత్తం ఏపీలో ఓటర్లు నాలుగు కోట్ల పై చిలుకు ఉంటే అందులో సగానికి పైగా అంటే రెండున్నర కోట్ల జనాభా పైగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ప్రభుత్వంగా ఉంది.
ఈ రోజున ఎవరు వెళ్ళి సర్వే చేసినా ప్రభుత్వం తరఫున ఏదో ఒక పధకం తమకు అందిందని చెప్పేవారే ఎక్కువ మంది ఉన్నారు. అలా రెండున్నర కోట్ల మందిని తన వైపున ఉంచుకుని వైసీపీ రానున్న ఎన్నికల యుద్ధంలోకి దిగుతోంది. ఇక ఈ రెండున్నర కోట్ల మంది ఓట్లు వేస్తే కనుక వైసీపీ ఓట్ల షేర్ 2019 కంటే మించిపోతుంది. అది ఏకంగా 58 శాతానికి పై దాటేస్తుంది.
కానీ అలాంటి అతి అంచనాలు అయితే వైసీపీ వ్యూహకర్తలకు కూడా లేనే లేవు అంటున్నారు. అందులో కూడా కోటి మందిని పెద్దగా పట్టించుకోకపోయినా తమకు కోటిన్నర మంది అండగా నిలుస్తారు అని ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. 2019లో కూడా ఇదే జరిగింది. కోటిన్నర మంది వైసీపీ జెండా ఎత్తితే అద్భుతమైన విజయం దక్కింది. ఈసారి కూడా కచ్చితంగా అదే జరిగి తీరుతుంది అని అంటోంది.
ఇక నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కానీ ఏపీలో 2019లో ఎన్నికలు జరిగితే 80 శాతం గా పోలింగ్ నమోదు అయింది. అంటే మూడు కోట్ల మంది దాకా ఓట్లు వేశారు అన్న మాట. అందులో సగానికి సగం ఓట్లు వైసీపీకి దక్కాయి. ఈసారి కూడా అదే జరుగుతుందని వైసీపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
అందుకే వైసీపీ పూర్తిగా సంక్షేమ పధకాల మీదనే ఆధారపడిందని అంటున్నారు. ఇక వైసీపీ ఎన్నికల ప్రణాళిక మరోసారి బ్రహ్మాస్త్రంగా అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను మించి ఈసారి వైసీపీ సరికొత్త హామీలను ఇస్తుంది అని అంటున్నారు. అయిదేళ్ళ పాటు హామీలను నెరవేర్చిన చరిత్ర ట్రాక్ రికార్డు తమకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా జనాల మొగ్గు తమకు ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ కోటిన్నర మంది ఓటర్లు తమ వైపే ఉన్నారని దృఢ విశ్వాసంతో ఉంది అని చెప్పాలి.