Begin typing your search above and press return to search.

రూపాయికి నాలుగు సిలిండర్లు ఇస్తా.. నన్ను గెలిపించండి!

వీరి ప్రచారంలోనూ.. హామీల్లోనూ నిత్యం వినియోగించే గ్యాస్ బండల మీద ఇచ్చిన హామీ ప్రధానాకర్షణగా మారింది.

By:  Tupaki Desk   |   11 Nov 2023 9:30 AM GMT
రూపాయికి నాలుగు సిలిండర్లు ఇస్తా.. నన్ను గెలిపించండి!
X

ఎన్నికల వేళ నేతలు ఇచ్చే హామీలకు అడ్డే ఉండదు. తమను గెలిపించి.. అధికారం ఇవ్వాలే కానీ కొండ మీద ఉన్న కోతిని సైతం కిందకు దిగేలా చేస్తామన్న మాటను చెబుతుంటారు. ఎన్నికల వేళ అధికార.. ప్రతిపక్ష పార్టీలు తమకు అధికారం చేతికి వస్తే పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆరు హామీల పేరుతో కాంగ్రెస్ భారీగా ప్రచారం చేస్తుండగా.. అంతకు మించి మరీ సేవలు అందిస్తామని అధికార బీఆర్ఎస్ చెబుతోంది.


వీరి ప్రచారంలోనూ.. హామీల్లోనూ నిత్యం వినియోగించే గ్యాస్ బండల మీద ఇచ్చిన హామీ ప్రధానాకర్షణగా మారింది. గ్యాస్ సిలిండర్ ను రూ.500కు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.ఆ మాటకు వస్తే.. అందరికంటే ముందు గ్యాస్ బండను రూ.500లకే ఇస్తామని చెప్పటం ద్వారా అందరిని ఆకర్షించింది. ఈ మధ్యనే అధికార బీఆర్ఎస్ సైతం అదే తరహాలో హామీ ఇచ్చింది.

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తే తాము గ్యాస్ బండను రూ.400లకే ఇస్తామని తమ ఎన్నికల హామీ పత్రంలోనూ ప్రకటించాయి. ఇలాంటివేళ.. సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేశ్ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లను రూపాయికే అందిస్తానని.. రూపాయికే న్యాయ సలహాలు ఇస్తానని చెబుతున్నాడు. అంతేకాదు.. రూపాయికే వైద్యం.. రూపాయికే విద్యను అందించనున్నట్లుగా చెప్పారు. ప్రతి వంద ఫ్యామిలీలకు ఒక వాలంటీరును నియమించి.. 70 ఏళ్లు దాటిన వారు అత్యవసర బటన్ నొక్కగానే సాయం అందిస్తామంటూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఒక్క అభ్యర్థి ఇన్ని హామీలు తీరుస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే.. తన హామీలతో అందరిని ఆకర్షిస్తున్నారని మాత్రం చెప్పక తప్పదు.