హైదరాబాద్ లో ‘‘నాలుగో సిటీ’’.. సరికొత్త నగరం..
ప్రస్తుతం హైదరాబాద్ లో 4 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే.. దానికి కారణం సైబరాబాదే.
By: Tupaki Desk | 16 Dec 2023 12:28 PM GMTఓ 30 ఏళ్ల కిందటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జంట నగరాలు అంటే.. హైదరాబాద్, సికింద్రాబాద్. ఇందులోనూ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఓ ప్రత్యేకం. ఇవి కాక.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సైబరాబాద్ కు రూపకల్పన చేశారు. ముందుగా హైటెక్ సిటీని స్థాపించి దాని చుట్టూ సైబరాబాద్ అనే నగరం నిర్మితమయ్యేలా ప్రణాళిక వేశారు. అది ఇప్పుడు ఎంతగా విజయవంతం అయిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో 4 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే.. దానికి కారణం సైబరాబాదే. అందుకే దానిని ‘‘సైబర్ సిటీ’’గా పేర్కొంటుంటారు.
మరో నగరం పురుడు పోసుకుంటోందా?
హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత వచ్చిన సైబరాబాద్. హైదర్,సికిందర్ పేర్ల మీద మొదటి రెండు నగరాలకు పేర్లు వచ్చాయి. ఐటీకి కేంద్రం కాబట్టి మూడో నగరానికి సైబరాబాద్ అని పేరు పెట్టారు. చంద్రబాబు ప్రయత్నానికి.. బీఆర్ఎస్ ప్రభుత్వం సైబరాబాద్ కు పోలీస్ కమిషనరేట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరింత గుర్తింపు తెచ్చింది. కాగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మదిలో మరో నగరం పురుడు పోసుకుంటోందని చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని కందుకూరు వద్ద ఫార్మా సిటీ నిర్మాణానికి సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్ షిప్ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఇటీవల ఆదేశించారు. అదే సమయంలో హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఫార్మాసిటీ ఉండకూడదని.. నగరానికి దూరంగా తరలించడం మంచిదని కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ‘‘నాలుగో సిటీ’’ ఆలోచన గురించి చెబుతున్నారు.
హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల పరిధిలో 19 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఇప్పుడు ఈ ఫార్మా సిటీ ప్రతిపాదనను ఉపసంహరించుకుని ఆ స్థలాల్లో టౌన్ షిప్ అభివృద్ది చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయిస్తోందనే చర్చ జరుగుతోంది.
ఆ 19 వేల ఎకరాల్లో..
హైదరాబాద్ లో ఫార్మా పరిశ్రమను మరింతగా విస్తరించాల్సిన ఆవశ్యకత రీత్యా 3 జిల్లాల పరిధిలో కొత్త ఫార్మా సిటీ ఏర్పాటుకు దాదాపు ఐదేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఫార్మా సిటీ ప్రాజెక్టుకు 19వేల ఎకరాలు అవసరం అని గుర్తించగా, దీనిలో దాదాపు 10వేల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. 70 శాతం భూసేకరణ పూర్తి కాగా, మిగతా భూమి విషయంలో స్థానికుల నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. భూములు కోల్పోవడంతో పాటు కాలుష్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని నిస్పష్టంగా ప్రకటించింది
హైదరాబాద్ నగరానికి ఫార్మా రంగంలో 30 ఏళ్లుగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐటీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఈ రంగం. హైదరాబాద్ చుట్టుపక్కల వెయ్యి పైగా భారీ, మధ్య తరహా ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. జీడిమెట్ల, ఖాజీపల్లి, పాశమైలారం, ఉప్పల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లోని ఈ పరిశ్రమల్లో లక్షమందికి పైగా ప్రత్యక్షంగా, మరో లక్ష మందికిపైగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
దాదాపు 35 సంవత్సరాల క్రితం హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా పరిశ్రమలు నెలకొల్పిన ప్రాంతాల్లో ఇప్పుడు జనావాసాలు వచ్చాయి. కాలుష్య సంబంధమైన సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు లేదా ఉన్న పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు గత ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ఫార్మా పరిశ్రమల కోసం అనువైన ప్రాంతాన్ని వెతకాల్సిన పరిస్థితి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఫార్మా కంపెనీలకు ఉత్పన్నమైంది.