Begin typing your search above and press return to search.

బాబు ఫ్యామిలీకి నాలుగు...సీనియర్లకు మాత్రమే కట్ ...!?

తాము టికెట్లు అడితే ఒక ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని చెబుతూ వచ్చిన చంద్రబాబు తన ఫ్యామిలీకి మాత్రం నాలుగు టికెట్లు తీసుకున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 March 2024 3:45 AM GMT
బాబు ఫ్యామిలీకి నాలుగు...సీనియర్లకు మాత్రమే కట్ ...!?
X

రాజకీయాల్లోనే కాదు సమాజంలో ఎవరైనా ఏదైనా ఇతరులకు చెప్పాలీ అంటే ముందు తాము ఆచరించాలి అని అంటారు. ఇదే ఇపుడు టీడీపీ తమ్ముళ్లను మండించేస్తోంది. తాము టికెట్లు అడితే ఒక ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని చెబుతూ వచ్చిన చంద్రబాబు తన ఫ్యామిలీకి మాత్రం నాలుగు టికెట్లు తీసుకున్నారని అంటున్నారు.

అధినేత అయినంత మాత్రాన పార్టీ రూల్ వర్తించదా అని అంటున్న వారూ ఉన్నారు. ఇక చంద్రబాబు ఫ్యామిలీ ప్యాకేజీ ఎలా ఉందో చూస్తే కనుక కుప్పంలో ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. బావమరిది కం వియ్యంకుడు బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేస్తున్నారు. ఇక నారా లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ ఎంపీగా విశాఖ నుంచి పోటీలో ఉన్నారు.

దీంతో కొందరు సీనియర్లతో పాటు కీలక నేతలు దీన్ని గుర్తు చేస్తూ తమకు వేరే న్యాయమా అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూస్తే అచ్చెన్నాయుడుకి ఆయన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడుకు రెండు టికెట్లు బాబు ఇచ్చారు. ఇక రామ్మోహన్ బావ అయిన ఆదిరెడ్డి వాసుకు రాజమండ్రి సిటీ ఇచ్చారు. అంటే ఈ ఫ్యామిలీకి మూడు టికెట్లు అన్న మాట.

యనమల రామక్రిష్ణుడు ఫ్యామిలీకి మూడు టికెట్లు ఇచ్చారు అని అంటున్నారు. యనమల రామక్రిష్ణుడు కుమార్తె దివ్యకు తుని ఇస్తే అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. అలాగే యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి మైదుకూరు టికెట్ ఇచ్చారు.

ఇపుడ్ చూస్తే విజయనగరం నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తనకు ఎంపీ తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని కోరితే బాబు ఒక్కటే టికెట్ అని అశోక్ కి ఎంపీ టికెట్ కట్ చేశారు అని అంటున్నారు విశాఖ జిల్లాలో చూస్తే నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తున్నారు. కుమారుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ కోరితే ఫ్యామిలీ ప్యాక్ కి నో అని చెప్పారు అని ప్రచారం సాగింది.

అనంతపురంలో చూస్తే జేసీ ఫ్యామిలీ మూడు టికెట్లు కోరితే ఒక్కటే ఇచ్చారని వారు మండుతున్నారు. పరిటాల ఫ్యామిలీ రాప్తాడు ధర్మవరం కోరితే ఒక్కటే ఇచ్చి సర్దుకోమన్నారని అంటున్నారు. కర్నూల్ లో కేఈ కోట్ల కుటుంబాలకు కూడా ఒక్కటే టికెట్ అని చెప్పేశారు.

ఇలా పార్టీలో సీనియర్లకు ఈ దఫా రెండు కాదు ఒక్కటే అని సీలింగ్ పెట్టేశారు. అయితే చంద్రబాబు తన కుటుంబానికి నాలుగు టికెట్లు తీసుకుని తన సన్నిహితులకు మూడేసి టికెట్లు ఇచ్చారని పార్టీలోనే చర్చ సాగుతోందిట. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అయితే మీ కుటుంబానికి మూడు టికెట్లు ఇచ్చామని చెప్పి నో చెప్పేశారు.

ఆయన కుటుంబం అంటే అల్లుడు రామ్మోహన్ అన్న మాట. ఈ వియ్యం అందుకోనప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటూ నాలుగు దశాబ్దాలుగా ఎన్నికలలో పోటీ చేస్తున్న బండారుకు ఇపుడు ఇలా సీటు కట్ అయిందని అనుచరులు ఆవేదన చెందుతున్నారు.