మోదీ పర్యటన వేళ.. ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెగిన వేలు పార్శిల్
ఫ్రాన్స్ లో స్వేచ్ఛా కాంక్ష ఎక్కువే
By: Tupaki Desk | 15 July 2023 9:46 AM GMTఅది 2001-2004 సమయం.. అమెరికా కక్షగట్టి ఇరాక్, అఫ్ఘానిస్థాన్ మీద యుద్ధాలకు దిగిన కాలం.. అదే సమయంలో సార్స్ వైరస్ కలకలం.. దీంతో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జి బుష్ ను అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే కథనాలు వచ్చేవి. ఆయన ఇల్లు వైట్ హౌస్ కు పార్సిళ్లు పంపినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇవేమీ ఫలప్రదం కాలేదు. కాకపోతే ఇలాంటి ఘటనలు మరో రూపంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అనేక దేశాల్లో అధ్యక్షులు, ప్రధానులపై తమ వ్యతిరేకత, కోపాన్ని చాటేందుకు ప్రజలు నిరసనలు చేస్తుంటారు. కొందరైతే అధ్యక్షులు, ప్రధానుల కార్యాలయాలు/ఇళ్లకు చిత్రవిచిత్రమైన పార్సిళ్లు పంపుతుంటారు. ఇలాంటిదే ఫ్రాన్స్ లో జరిగిన తాజా ఘటన. చిత్రమేమంటే.. మన ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫ్రాన్స్ లో స్వేచ్ఛా కాంక్ష ఎక్కువే. వివిధ దేశాల వారు అక్కడకు వచ్చి స్థిరపడుతుంటారు. మత ఉగ్రవాదం కూడా అధికమే. ఇటీవల ఓ అల్జీరియా కుర్రాడిని పోలీసులు అకారణంగా కాల్చి చంపారంటూ కొన్ని రోజుల పాటు ఫ్రాన్స్ లో అల్లర్లు చెలరేగాయి. గతంలోనూ భయంకర ఉగ్రవాద దాడులకు కేంద్రమైంది ఈ దేశం. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్ష భవనంలో గుర్తుతెలియని వ్యక్తి పంపిన ఓ తెగిన వేలు కలకలం రేపింది.
అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రన్ అధికారిక నివాసం పేరు ఎలిసీ ప్యాలెస్. ఈ భవనానికి 'తెగిన వేలు'తో ఉన్న ప్యాకేజీ వచ్చింది. అయితే, అది సోమ, మంగళవారాల్లో వచ్చింది. ఎవరు ఇలా పంపింది..? అని తేల్చేందుకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వేలు కోసి పంపాడా..?
ప్యాకేజీలో వచ్చిన వేలు ఎవరిదా..? అని ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్యాకేజీని పంపిన వ్యక్తిదే ఈ వేలు అని విచారణ అధికారి అనుమానిస్తున్నారు. కాగా, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తే ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలిసీ ప్యాలెస్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గత నెల అలా.. ఇప్పుడు ఇలా..
జూన్ లో పోలీసుల కాల్పుల్లో పారిస్ లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున అల్లర్లు జరిగాయి. వేలాదిమంది ఆందోళనకారులు వారాల పాటు రోడ్లపై నిరసనలు చేపట్టారు. హింస కూడా చెలరేగింది. ప్రభుత్వ భవనాలు, వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. దీంతో అధ్యక్షుడు మేక్రన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు శాంతించాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చారు.
మరోవైపు ప్రధాని మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. రాఫెల్ విమానాల ఒప్పందంతో పాటు సబ్ మెరైన్ల కొనుగోలుకు చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్ తో శనివారం భేటీ అయ్యారు. అన్నిటికి మించిన విశేషం ఏమంటే.. భారత్ ను ప్రపంచ బాహుబలి అంటూ మేక్రన్ భారీగా పొగడ్తలు కురిపించారు.