హైదరాబాద్ కేటుగాడు.. టీటీడీ చైర్మన్ ఫొటోతో ఏం చేశాడో తెలుసా?
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. తన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి.. టీటీడీ దర్శనాల పేరిట ఎన్ఆర్ఐ భక్తులను మోసం చేస్తున్నాడు.
By: Tupaki Desk | 18 Feb 2025 11:09 AM GMTటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. తన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి.. టీటీడీ దర్శనాల పేరిట ఎన్ఆర్ఐ భక్తులను మోసం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చైర్మన్ నాయుడు కంగుతిన్నారు. టీటీడీలో సంస్కరణలకు తాను ఎంతగానో ప్రయత్నిస్తుంటే.. ఎవరో కేటుగాడు తన ఫొటోనే వాడేయడంతో షాక్ తిన్నారు నాయుడు. వెంటనే ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ కు చేరవేయడంతో చైర్మన్ ఫొటోతో మోసాలు చేస్తున్న కేటుగాడిని గుర్తించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన తిరుమలలో కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజూ లక్షల మంది భక్తులు వచ్చే ఈ పుణ్యక్షేత్రంలో మోసాలకు కూడా కొదవ ఉండటం లేదు. భక్తుల విశ్వాసమే పెట్టుబడిగా కొందరు చెలరేగిపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు శ్రీవారిని త్వరగా దర్శించుకోవాలని ఆత్రుత చూపుతారు. అయితే దర్శనం టికెట్లు, వసతి సౌకర్యాల కోసం తెలియకపోవడమో.. అవి అందుబాటులో లేకపోవడమే మోసగాళ్లను ఆశ్రయించి నష్టపోతున్నారు. భక్తుల ఆత్రుతను పసిగట్టి చాలామంది మోసగాళ్లు తిరుమలకు మచ్చతెస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఆన్ లైన్ పద్ధతిలో టికెట్లు విక్రయిస్తుంటారు. నడకదారి భక్తులతోపాటు సర్వదర్శనం క్యూలైన్ ద్వారా దర్శనాలు కల్పిస్తారు. అయితే గంటల కొద్ది సమయం వేచిచూడలేని వారు, విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐ భక్తులు దర్శనం కోసం దళారులను ఆశ్రయిస్తుంటారు. డబ్బుకు కొదవలేకపోవడంతో ఎంతైనా చెల్లించి దర్శనం చేసుకోవాలని భావిస్తారు. అయితే వీరి విశ్వాసమే కొందరు దళారులకు పెట్టుబడి అవుతోంది. మాయమాటలు చెప్పి ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శనాలు అంటూ మోసాలు చేస్తున్నారు. అయితే తమ పేరు చెబితే ఎవరూ డబ్బులివ్వరని టీటీడీలో పలుకుబడి ఉన్నవారి పేర్లు వాడేస్తుంటారు. ఇలాంటి మోసాలు గతంలో చాలా వెలుగుచూశాయి. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫొటోతోనే మోసాలకు దిగడం ఆశ్చర్యానికి గురిచేసింది.
చైర్మన్ నాయుడు ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆర్జిత సేవ, బ్రేక్ దర్శనాల పేరిట మోసాలు చేస్తున్నాడు. ఈ విషయం స్వయంగా చైర్మన్ కు తెలియడంతో ఆయన వెంటనే రంగంలోకి దిగారు. తన ఫొటోతో మోసం చేస్తున్న వ్యక్తిని గుర్తించాలని ఆదేశించారు. చైర్మన్ సూచనలతో పోలీసుల సహకారంతో మోసగాడిని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ జావెద్ ఖాన్ తిరుమలలో ఉంటూ చైర్మన్ ఫొటోతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. స్వామి వారి దర్శనానికి ఎలాంటి రికమండేషన్ పనిచేయదని, దళారులు, మోసగాళ్లను ఎవరూ సంప్రదించవద్దని చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు.