ఏపీ సీఎంవోలో ఫేక్ పిటిషన్లు... ఐదుగురిని అరెస్టు చేసిన సీఐడీ!
ఏపీ సీఎం కార్యాలయంలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం సంచలనం రేపింది.
By: Tupaki Desk | 12 Aug 2023 9:34 AM GMTఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో అతి పెద్ద మోసం బయటపడింది. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే.. కొంతమంది కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది.
అవును... సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్ సంతకాల మోసం వెలుగులోకి వచ్చింది. ఏపీ సీఎం కార్యాలయంలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వివరాలను సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఆయన ప్రకటించారు.
ఈ విషయంపై సీఎంవో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎంవోలో.. రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న కొందరు డిజిటల్ సంతకాలు దుర్వినియోగం చేశారని తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
వివరాళ్లోకి వెళ్తే... గత కొన్ని నెలలుగా సీఎంవోలో ఉన్న కార్యదర్శుల ఈ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్, పాస్ వర్డ్ లను వినియోగించి.. ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థనలను సీఎంవో కార్యదర్శులకు తెలియకుండా సీఎం పిటిషన్లు తయారీ చేస్తున్నారట. వీటిని సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు.
ఇదే సమయంలో సీఎం పిటిషన్లను ఏ శాఖకు కావాలంటే ఆ శాఖ సెక్రెటరీ టు సీఎం సంతకాలను కాపీ, పెస్ట్ చేసి పంపించేవారట. ఇలా చేసేందుకు డబ్బులు తీసుకుని వీళ్లంతా పంచుకోవడం చేశారట.
ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో ఇలాగే ఒక పిటిషన్ రాగా.. అనుమానంతో క్రాస్ చెక్ చేసి, శాఖపరమైన విచారణ చేసి నిర్ధారించుకుని మొదటి ముద్దయిని ఉద్యోగం నుంచి తొలగించారట. ఈ సమయంలో మిగిలిన కార్యదర్శలు వారి శాఖలలోని లాగిన్స్ చెక్ చేసుకోగా సుమారు 66 సీఎంపీలు ఫేక్ అని గుర్తించారట.
దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు... ఐదుగురు నిందితులను గుర్తించారు. ఫైల్ ప్రాసెసింగ్ కి వీళ్ల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వీళ్లు ఒక్కొక్క ఫైల్ ప్రాసెస్ చేయడానికి రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు.
తాజాగా... సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకోవడంతో వీళ్లని కస్టడీలోకి తీసుకుని, జుడీషియల్ రిమాండ్ కి తరలిస్తామని సీఐడీ ఎస్పీ తెలిపారు.
అరెస్టు చేసిన ఐదుగురు... కనమర్ల శ్రీను (ముత్యాల రాజు పేషీలో మాజీ డీఈఓ), నలజల సాయి రామ్ (జవహర్ రెడ్డి పేషీలో డీఈవో), గుత్తుల సీతారామయ్య (ధనుంజయ రెడ్డి పేషీలో అడెంటర్), చైతన్య (ముత్యాలరాజు పేషి), అబ్దుల్ రజాక్ (జవహర్ రెడ్డి పేషీలో డీఈవో) అని తెలిపారు!